
కాంగ్రెస్ పార్టీ ప్రజలను అన్నిరకాలుగా మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆరోపించారు.
గ్యారెంటీల అమలులో వైఫల్యం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సమక్షంలో బాండ్ పేపర్లపై రాసిచ్చి మరీ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు నమ్మబలికారని గుర్తు చేశారు. కానీ నేడు 800 రోజులు గడిచినా ఆ గ్యారెంటీలు ఎక్కడ అమలవుతున్నాయో చెప్పాలని నిలదీశారు. ఎస్సీ, బీసీ డిక్లరేషన్ల పేరిట ఆయా వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు. విద్యార్థులకు ఇస్తామన్న ప్రోత్సాహక నగదు పక్కన పెడితే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు, మహిళలకు దగా
వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు 15,000 రూపాయల భరోసా, పంటల బీమా, బోనస్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు వారి మొహం చాటేస్తున్నారని అన్నారు. అలాగే గతంలో కేసీఆర్ గారు పెంచిన 2,000 రూపాయల పెన్షన్‌ను 4,000 చేస్తామని చెప్పి 27 నెలలు దాటినా అమలు చేయకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
ఈ నెల 26న ప్రవేశపెట్టే బడ్జెట్‌పై తమ డిమాండ్లను స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్‌లోనైనా వాస్తవాలను పొందుపరచాలని కోరారు. బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులకు తక్షణమే 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేలా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
యువతకు అన్యాయం
రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ఒక్క నిరుద్యోగికి కూడా ప్రభుత్వం నుండి సాయం అందలేదని విమర్శించారు. అసెంబ్లీలో బల్లలు చరిచి చెప్పిన మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఈ బడ్జెట్‌నైనా వాస్తవికతకు దగ్గరగా రూపొందించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని హరీశ్ డిమాండ్ చేశారు.



