తెలంగాణసంగారెడ్డి

IITH: ఐఐటీ హైదరాబాద్​ వేదికగా.. టెక్నో–సాంస్కృతిక ఉత్సవం ప్రారంభం!

దక్షిణ భారతదేశంలోనే విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద టెక్నో–సాంస్కృతిక ఉత్సవం ఎలాన్ అండ్ ఎన్‌విజన్–2026 ఘనంగా ప్రారంభమైంది.

  • ఎలాన్ అండ్ ఎన్‌విజన్–2026ను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • మూడు రోజులు జరిగే కార్యక్రమాల్లో 30 వేల మందికి పైగా విద్యార్థుల భాగస్వామ్యం

కందిలి, సంగారెడ్డి: దక్షిణ భారతదేశంలోనే విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించే అతిపెద్ద టెక్నో–సాంస్కృతిక ఉత్సవం ఎలాన్ అండ్ ఎన్‌విజన్–2026 ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ కు వచ్చి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఇది 17వ ఎడిషన్​. జనవరి 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా 30 వేల మందికి పైగా విద్యార్థులు, ఆవిష్కర్తలు, కళాకారులు, యువకులు పాల్గొననున్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక పోటీలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలోచనాత్మక చర్చలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

యువతే దేశ సాంకేతిక భవిష్యత్‌
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎలాన్ అండ్ ఎన్‌విజన్ జ్ఞానాన్ని పంచుకునే, అభివృద్ధిలో ఉన్న ఆధునిక సాంకేతికతలతో మమేకమయ్యే అత్యుత్తమ వేదిక అని అన్నారు. సాంకేతికత.. జీవన రంగాలన్నింటినీ మార్చుతున్న ఈ సమయంలో, విద్యార్థులు కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా, ఆవిష్కర్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన అటానమస్​ నావిగేషన్ వెహికిల్స్​ వంటి ఆధునిక ఆవిష్కరణలు సంస్థ సాంకేతిక నాయకత్వానికి నిదర్శనమన్నారు. పేర్కొన్నారు.

ది లాస్ట్ రోనిన్ థీమ్‌తో ఉత్సవం
ఈ ఏడాది ఉత్సవానికి “ది లాస్ట్ రోనిన్” అనే ప్రధాన థీమ్‌ను ఎంపిక చేశారు. ధైర్యం, స్వతంత్రత, అత్యుత్తమత సాధన వంటి విలువలను ప్రతిబింబించే ఈ థీమ్ భారతదేశ భవిష్యత్ ఆవిష్కర్తలు, నాయకులకు స్ఫూర్తినివ్వనుంది.

ఐఐటీ హైదరాబాద్ ఆత్మస్వరూపం ఇదే

ఎలాన్ అండ్ ఎన్‌విజన్ సాంకేతికత, సృజనాత్మకత, సంస్కృతి కలయికతో బాధ్యతాయుత ఆవిష్కర్తలను తీర్చిదిద్దే వేదిక. తరగతి గదులను మించి ఆలోచించేలా, విభాగాల మధ్య సహకారం పెంపొందించేలా ఈ ఫెస్టివల్ విద్యార్థులకు అవకాశాలు కల్పించనుంది. దాదాపు 30వేల మంది పైగా విద్యార్థులు ఇందులో భాగస్వాములు కానున్నారు.

– ప్రొఫెసర్​ బీఎస్​ మూర్తి, డైరెక్టర్​, ఐఐటీ హైదరాబాద్​

ఎన్‌విజన్ ఎక్స్ 26 టెక్ సమ్మిట్
జనవరి 10న ఎన్‌విజన్ ఎక్స్ 26 పేరిట తొలి టెక్నాలజీ సమ్మిట్ నిర్వహించనున్నారు. సుస్థిరత – హరిత శక్తి అంశంపై జరిగే ఈ సమ్మిట్‌లో వాతావరణ మార్పులు, గ్రీన్​ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధిపై నిపుణులు చర్చించనున్నారు. వేలాది మంది పాల్గొనడం, ఆధునిక సాంకేతిక పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, జ్ఞానాధారిత చర్చలతో ఎలాన్ అండ్ ఎన్‌విజన్–2026 ఐఐటీ హైదరాబాద్‌ను మరోసారి జాతీయ స్థాయిలో సాంకేతిక–సృజనాత్మక కేంద్రంగా చాటనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *