Kistareddypet: కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలి!
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బల్దియా డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

* జీహెచ్ఎంసీ డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది
* అమీన్పూర్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే
* లేని పక్షంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
* అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహర దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కందిలి, పటాన్ చెరు: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బల్దియా డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో తప్పనిసరిగా నాలుగు డివిజన్లు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. లేనిపక్షంలో సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. అఖిల పక్ష నేతలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
గూగుల్ మ్యాప్స్ ద్వారా.. డివిజన్ల ఏర్పాటు అన్యాయం!
‘‘పరిపాలన సౌలభ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో నూతన డివిజన్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు, సర్వేలు నిర్వహించకుండా కేవలం గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేయడం అన్యాయం. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 1.20లక్షల ఓటర్లు, 3లక్షల జనాభా ఉంది. కానీ ఇక్కడ రెండే డివిజన్లు ఏర్పాటు చేశారు. ఇది సమంజసం కాదు. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి జరగాలంటే 25 వేల నుంచి 30 వేల ఓటర్లకు ఒక డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి, బల్దియా కమిషనరుకు వినతి పత్రాలు అందించా’’మని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోని పక్షంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.



