Narsapur: రైతును స్తంభమెక్కించిన.. ఏఈ రామ్మూర్తికి.. షోకాజ్ నోటీస్!

* చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నతాధికారుల కసరత్తు
* ‘జీతం తీసుకునే సారు ఒడ్డున కూర్చోని.. బక్కరైతును స్తంభమెక్కించాడు’ కథనానికి స్పందన
* ‘కందిలి’ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వేదికల్లో వైరల్ అయిన వీడియో
* అధికారి తీరును తప్పు పడుతూ 3,535 మంది ఈ వీడియో చేశారు
* రైతుల కష్టం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిన ఈ వీడియోకు 9.54లక్షల వ్యూస్
కందిలి, సంగారెడ్డి: నర్సాపూర్ మున్సిపాలిటీలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ ఏఈ రామ్మూర్తిపై చర్యల దిశగా అధికారులు ఉపక్రమించారు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. రైతుల కష్టాన్ని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యవైఖరిని వెలుగులోకి తెచ్చేలా ‘కందిలి’ కథనాన్ని అందించింది. ‘‘జీతం తీసుకునే సారు ఒడ్డున కూర్చొని.. బక్క రైతును స్తంభమెక్కించాడు”శీర్షికన కథనం ఇవ్వడంతో పాటు, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం సోషల్ మీడియా ద్వారా వీడియోలను అందించింది. దీంతో విద్యుత్ శాఖ మెదక్ జిల్లా ఎస్ఈ నారాయణ నాయక్ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈ రామ్మూర్తిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా షోకాజ్ నోటీసు అందించామని ‘కందిలి’ ప్రతినిధికి తెలిపారు.
చర్చనీయాంశంగా మారిన.. ఘటన!
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్ లో విద్యుత్ తీగలు తెగాయి. రైతుల పొలాల్లో పడ్డాయి. వీటిని సరిచేయాలని చాలా సార్లు రైతులు కోరారు. అయినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదు. మూడు రోజుల తర్వాత ఏఈ రామ్మూర్తి పొలం వద్దకు వచ్చారు. తాను ఒడ్డున కూర్చొని, నారాయణ అనే రైతును స్తంభం ఎక్కించాడు. అతడితోనే తెగిన తీగలను సరిచేయించాడు. ఈ అంశమై ‘కందిలి’ ప్రత్యేక వార్తా కథనాలను అందించింది. దీంతో విద్యుత్ అధికారుల తీరు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
భారీస్థాయిలో స్పందించిన… వీక్షకులు!
రైతును స్తంభమెక్కించిన అంశంతో పాటు ఏఈ రామ్మూర్తి నిర్లక్ష్యంగా ఇచ్చిన సమాధానాలకు సంబంధించిన వీడియోను ‘కందిలి’ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం వేదికల్లో పోస్ట్ చేసింది. ప్రజలు భారీస్థాయిలో స్పందించారు. 24గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు 9.54లక్షల వ్యూస్ వచ్చాయి. 3,535 మంది ఈ వీడియోను షేర్ చేశారు. 300 మందికి పైగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఈ నిర్లక్ష్య పనితీరును తప్పుపట్టారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆవేదనగా తెలిపారు. ఉన్నతాధికారులు ఇలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలనూ భర్తీ చేయాలని మరికొందరు కోరారు. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.



