Harish Rao: రేవంత్ రెడ్డికి… సైబర్ నేరగాళ్లకు పెద్ద తేడా లేదు
తెలంగాణ ప్రజలకు విప్లవం గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యమ క్రాంతి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి”అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అభివర్ణించారు.

* ట్రాఫిక్ చలానాల పేరిట బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డబ్బులు లాగాలన్నదే ఆయన ఆలోచన
* రుణమాఫీ నుంచి యూరియా పంపిణీ వరకు అన్ని విషయాల్లోనూ రైతులకు ఇబ్బందే
* సంక్రాంతి పండుగకు రైతు బంధు జమవుతుందని ఆశగా ఎదురుచూసిన అన్నదాతలకు నిరాశే
* రాష్ట్ర సాధనలో తెలంగాణలో ఉద్యమ క్రాంతి
* టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ది క్రాంతి
* నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటాల క్రాంతి
* జహీరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు
కందిలి, జహీరాబాద్: ‘‘తెలంగాణ ప్రజలకు విప్లవం గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యమ క్రాంతి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి”అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అభివర్ణించారు. ట్రాఫిక్ చలానాల పేరిట నేరుగా ప్రజల ఖాతాల్లో నుంచి డబ్బులు లాగాలని చూస్తున్నారన్నారు. ఈ విషయంలో సైబర్ నేరగాళ్లకు, సీఎం రేవంత్ రెడ్డికి పెద్దగా తేడా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. జహీరాబాద్ లో ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రైతులకు… తీవ్రస్థాయిలో ఇబ్బందులు!
‘‘ఈరోజు ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి వేళ అన్నదాతలను ఆందోళనలో పెట్టింది. రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా రైతులను ఇబ్బందుల పాలు చేస్తోంది. సగానికి సగం మందికి రుణమాఫీ కాలేదు. ఎండకు, వానకు, చలికి లైన్లో యూరియా కోసం నిరీక్షించాల్సిన దయనీయ స్థితి. యాపులు, మ్యాపుల పేరిట ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోంది. సంక్రాంతి పండుగకు రైతుబంధు డబ్బులు పడతాయని ఆశగా ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధువేసి రైతు బాంధవుడుగా నిలిచారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేయలేదు. రుణమాఫీ పూర్తి చేయలేదు. యాసంగి పంటకు బోనస్ ఇవ్వలేద’’ని హరీశ్ రావు విమర్శించారు.
ఖాతాల్లో నుంచి.. డబ్బులు లాగాలని చూస్తున్నారు!
‘‘రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఈమధ్య మీరందరూ వినే ఉంటారు. బండ్ల మీద చలాన్ పడితే బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా కట్ చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రజలకు చెప్పకుండా, వారికి సంబంధం లేకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు లాగాలనేది ఆయన ఆలోచన. ప్రజల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసింది కేసీఆర్. రైతుబంధు డబ్బులు, ఆసరా పెన్షన్లు నేరుగా అకౌంట్లలో కేసీఆర్. కానీ సీఎం రేవంత్ రెడ్డి వారి ఖాతాల నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు తెలవకుండా వారి అకౌంట్లో నుంచి డబ్బు తీసుకునే వాళ్లని సైబర్ నేరగాళ్లు అంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాళ్లకి పెద్ద తేడా లేద’’ని హరీశ్ రావు ఆరోపించారు.



