ఆయన చొరవను గుర్తు చేసుకున్న జగ్గారెడ్డి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చొరవను, ఆయన చేసిన సాయాన్ని సంగారెడ్డి ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో వర్క్ లోడును పెంచి, వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కేలా ఆయన కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ’’2012 -13లో ఢిల్లీలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను అప్పటి రాజ్య సభ ఎంపీ రేణుక చౌదరితో పాటు వెళ్లి కలిశాను. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలోని ఎద్దు మైలారంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ స్థాపించిన ODF (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) వర్క్ లోడును తమిళనాడులోని జబల్పూరుకు తరలించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో వర్క్ లోడ్ ఇక్కడి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి కేటాయించాలని, తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చాం. మా విజ్ఞప్తిని మన్నించిన మన్మోహన్ సింగ్ వర్క్ లోడును ఇక్కడి ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి మంజూరు చేయించారు. దీనివల్ల గత 12 ఏళ్లుగా ఇక్కడ వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. మన్మోహన్ సింగ్ సహాయాన్ని మా సంగారెడ్డి ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేర‘‘ని జగ్గారెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల తరపున తాను దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.