రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా సంగారెడ్డిలో మహాసభలు
ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులే
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. వీరయ్య
సంగారెడ్డి వేదికగా జనవరి 25నుంచి 28వరకు నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు చారిత్రక ప్రాధాన్యం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. వీరయ్య అన్నారు. తెలంగాణలో ప్రజలు వామపక్షాల వైపు చూస్తున్నారని ఆయన వివరించారు. సీపీఎం బలపడాలని, ఎర్రజెండా ఎగరాలని వారు కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేవలం అధికారం కోసం కొట్లాడుకుంటారన్నారు. ప్రజల పక్షాన పోరాడేది కేవలం కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. ధనిక వర్గాల ప్రయోజనాలు తప్ప ఆ మూడు పార్టీలకు వ్యవసాయ కూలీలు, కార్మికులు, గిరిజనులు, దళితులు కనిపించరన్నారు.
మహాసభల్లో ఇదే కీలక ఎజెండా!!
సంగారెడ్డి వేదికగా నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర మహాసభల్లో భాగంగా రాష్ట్రంలో వామపక్షాల పాత్ర, బలం పెంచడానికి ఏం చేయాలనే కీలక ఎజెండాతో చర్చలు సాగిస్తామని ఎన్. వీరయ్య అన్నారు. ఇప్పటికే తెలంగాణ గ్రామీణ ప్రజల జీవితాన్ని అధ్యయనం చేసిందని, రానున్న రోజుల్లో మరింత లోతుగా అధ్యయనం చేస్తామన్నారు.
మహాసభలను విజయవంతం చేద్దాం!!
సంగారెడ్డిలో జనవరి 25-28 వరకు నిర్వహించనున్న మహా సభలను విజయవంతం చేయాలని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి, మహా సభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి జయరాజ్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో సోమవారం నిర్వహించిన ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు, రాష్ట్ర స్థాయి నాయకులు మల్లిఖార్జున్, అడివయ్య, అతిమేల మాణిక్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.