2025లో రికార్డులు సృష్టించిన బంగారం–వెండి.. 2026లో ఇంకా షాక్ ఇస్తాయా?
2025లో బంగారం, వెండి ధరలు చరిత్రాత్మక ర్యాలీ చూపించాయి. 2026లో కూడా బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. జియోపాలిటికల్ టెన్షన్, ద్రవ్యోల్బణం కీలక పాత్ర పోషించనున్నాయి.

- 2025లో బంగారం, వెండి ఆల్‌టైమ్ రికార్డులు
- 2026లో కూడా బుల్లిష్ ట్రెండ్ అంచనాలు
- గ్రీన్ టెక్నాలజీలతో వెండికి భారీ డిమాండ్
2025 సంవత్సరం బంగారం, వెండి మార్కెట్‌ను పూర్తిగా మార్చేసింది. ధరలు సాధారణ పెరుగుదల కాకుండా, రాకెట్ వేగంతో ఎగబాకాయి. పెట్టుబడిదారుల అంచనాలను మించి ర్యాలీ జరగడంతో ఈ ఏడాది విలువైన లోహాలకు “నామసంవత్సరం”గా మారింది.
2025లో ధరల పరుగులు:
సంవత్సరం ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.71,500గా ఉండగా, ఏడాది చివరికి అది రూ.1.39 లక్షల దాకా చేరింది. అంటే దాదాపు 80 శాతం పెరుగుదల. వెండి మరింత దూకుడు చూపించింది. కిలో వెండి ధర జనవరిలో రూ.90,500 చుట్టూ ఉండగా, డిసెంబర్ నాటికి రూ.2.32 లక్షలు దాటింది. శాతంగా చూస్తే ఇది 150 శాతం కంటే ఎక్కువ ర్యాలీ.
ఎందుకు ఇలా పెరిగాయి?:
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు బంగారాన్ని సేఫ్ అసెట్‌గా మార్చాయి. అదే సమయంలో పారిశ్రామిక అవసరాలు, సరఫరా పరిమితులు వెండికి అదనపు బలం ఇచ్చాయి. ముఖ్యంగా 2025లో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరను కొత్త ఎత్తులకు నెట్టాయి.
2026పై అంచనాలు:
విశ్లేషకుల ప్రకారం, ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే 2026లో కూడా బంగారం, వెండి బుల్లిష్ మూడ్‌లోనే ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గకపోతే, లోహాలపై డిమాండ్ బలంగా కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే మధ్యలో స్వల్ప కరెక్షన్లు వచ్చే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
బంగారం లక్ష్య ధరలు:
అంతర్జాతీయంగా బంగారం ఔన్సుకు 4,500 నుంచి 4,700 డాలర్ల మధ్య కదలాడవచ్చన్న అంచనాలు ఉన్నాయి. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ధరలు 5,000 డాలర్లను కూడా తాకే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే లేదా ఆర్థిక మందగమనం భయాలు పెరిగితే బంగారానికి మరింత మద్దతు లభించవచ్చు.
వెండి ఎందుకు ముందంజ?:
వెండి పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇది ఒకవైపు విలువైన లోహం, మరోవైపు కీలక పారిశ్రామిక లోహం. గ్రీన్ ఎనర్జీ మార్పిడిలో సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌లో వెండి వినియోగం పెరుగుతోంది. అందుకే 2026లో శాతం పరంగా వెండి బంగారాన్ని మించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.



