HyperVault Data : టాటా గ్రూప్, ఓపెన్ఏఐ మధ్య భారీ ఒప్పందం..
భారతీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్, దాని అనుబంధ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), అంతర్జాతీయ ఏఐ అగ్రగామి 'ఓపెన్ ఏఐ' (OpenAI) ఒక బహుళార్థక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి.

ముంబై: భారతీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్, దాని అనుబంధ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు అంతర్జాతీయ ఏఐ అగ్రగామి ‘ఓపెన్ ఏఐ’ (OpenAI) ఒక బహుళార్థక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. ఎంటర్‌ప్రైజ్, వినియోగదారు మరియు సామాజిక రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. టాటా గ్రూప్ సంస్థలవ్యాప్తంగా ఏఐ ఆధారిత ఆవిష్కరణలకు తోడ్పడటం సహా అత్యంత ప్రభావవంతమైన విభాగాల్లో, ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమలను ఏఐ దిశగా మళ్లించడానికి మరియు కీలక మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.
టాటా ఉద్యోగులకు ఎంటర్‌ప్రైజ్ చాట్‌జీపీటీ సాధికారత: ఈ ఒప్పందంలో భాగంగా నవకల్పనలు, ఉత్పాదకతకు ఊతమిచ్చేలా వేలాది మంది టాటా గ్రూప్ ఉద్యోగులకు ఎంటర్‌ప్రైజ్ చాట్ జీపీటీ అందుబాటులోకి రానుంది. అలాగే మెరుగైన సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఫలితాలను సాధించేలా టీసీఎస్ సంస్థ ఓపెన్ ఏఐకి చెందిన కోడెక్స్ (Codex) సాంకేతికతను ఉపయోగించుకుంటుంది.
పరిశ్రమల కోసం ప్రత్యేక ఏజెంటిక్ ఏఐ పరిష్కారాలు: అగ్రస్థాయి ఏఐ సొల్యూషన్స్ గల ఓపెన్ఏఐ మరియు అపారమైన పారిశ్రామిక అనుభవం మరియు ఏఐ నైపుణ్యాలు గల టీసీఎస్ కలిసి ఈ భాగస్వామ్య ఒప్పందం కింద నిర్దిష్ట పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ప్రభావవంతమైన సొల్యూషన్స్‌ని రూపొందించేందుకు కృషి చేస్తాయి.
ఉమ్మడి విపణి ప్రణాళికలు (GTM): సంస్థాగత స్వరూపాలకు అనుగుణంగా రూపొందిన ఏఐ ఆధారిత సొల్యూషన్స్ అందించడం ద్వారా భారతీయ మరియు గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్‌లు పరివర్తన చెందడంలో టీసీఎస్ మరియు ఓపెన్ఏఐ తోడ్పడతాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఓపెన్ ఏఐ యొక్క ప్లాట్‌ఫామ్‌లను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించడం ద్వారా తమ కస్టమర్ల సంస్థల్లో ఏఐ ఆధారిత పరివర్తనను వేగవంతం చేసేందుకు టీసీఎస్ తోడ్పడుతుంది.
ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి: టీసీఎస్ కు చెందిన ‘హైపర్‌వాల్ట్’ (HyperVault) విభాగం మరియు ఓపెన్ ఏఐ కలిసి భారత్‌లో భారీ ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు బహుళ సంవత్సరాల భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. మొదటి దశలో 100 మెగావాట్ల (MW) సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లను టీసీఎస్ ఏర్పాటు చేస్తుంది. దీనిని భవిష్యత్తులో 1 గిగావాట్ (1 GW) స్థాయికి పెంచే అవకాశం ఉంది. కొత్త తరం ఏఐ వర్క్‌లోడ్స్‌కి అవసరమైన శక్తిని ఈ మౌలిక సదుపాయాలు అందించనున్నాయి. తద్వారా భారత్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా నిలబెట్టనున్నాయి.
సామాజిక ప్రభావం: ఏఐని బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో తోడ్పడే దిశగా భారతీయ యువతకు ఏఐ శిక్షణ మరియు వనరులను అందించేందుకు ఓపెన్ఏఐ ఫౌండేషన్ మరియు టీసీఎస్ కలిసి పని చేస్తాయి. అలాగే, స్వచ్ఛంద సంస్థల (NGOs) కోసం ప్రత్యేక సాంకేతిక పరికరాలను అభివృద్ధి చేస్తాయి. సుమారు పది లక్షల మంది యువత యొక్క జీవనోపాధిని మెరుగుపర్చే లక్ష్యంతో పలు కార్యక్రమాలను ఆవిష్కరిస్తాయి.
“ఏఐ వినియోగానికి భారత్ ఇప్పటికే సారథ్యం వహిస్తోంది. ఇక్కడి ప్రతిభ, పట్టుదల మరియు ప్రభుత్వ మద్దతు చూస్తుంటే ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు తోడ్పడే విషయంలో భారత్ సముచిత స్థానంలో ఉందని తెలుస్తుంది. ఓపెన్ ఏఐ ఫర్ ఇండియా మరియు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం ద్వారా, దేశవ్యాప్తంగా ప్రజలకు ఏఐని అందుబాటులోకి తెచ్చేందుకు, దానితో వారు ప్రయోజనం పొందేందుకు తోడ్పడేలా, మేము భారత్‌లోనే, భారత్ కోసమే ఏఐని నిర్మించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, స్థానిక భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవడంపై పని చేస్తున్నాం” అని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.
“ఏఐ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలవాలన్న భారత్ విజన్ సాకారం దిశగా ఓపెన్ఏఐ మరియు టాటా గ్రూప్ మధ్య భాగస్వామ్యం ఒక కీలక మైలురాయి. భారత్‌లో అత్యుత్తమ ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఓపెన్ ఏఐతో జట్టు కట్టడం మాకు సంతోషంగా ఉంది. పరిశ్రమల్లో పరివర్తన తెచ్చేందుకు ఓపెన్ఏఐ మరియు టీసీఎస్‌లకు ఇదొక విశిష్టమైన అవకాశం. ఏఐ యుగంలో రాణించేలా భారత యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించి, వారికి సాధికారత కల్పిస్తాం” అని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు.
హైపర్‌స్కేలర్స్ మరియు ఏఐ ఆధారిత సంస్థలకు సురక్షితమైన, అత్యాధునికమైన, విశ్వసనీయమైన భారీ గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్లను అందించాలనే లక్ష్యంతో టీసీఎస్ 2025లో ‘హైపర్‌వాల్ట్’ను ప్రారంభించింది. పర్యావరణహిత విద్యుత్‌తో ఇది నడుస్తుంది. భారీ ర్యాక్ సాంద్రత మరియు అన్ని కీలక క్లౌడ్ ప్రాంతాల్లో నెట్‌వర్క్ కనెక్టివిటీతో నిర్దిష్ట అవసరాల కోసం నిర్మితమైన, లిక్విడ్ కూల్డ్ డేటా సెంటర్లను అందిస్తుంది. ఏఐలో గ్లోబల్ లీడర్ కావాలన్న భారత విజన్ సాకారం దిశగా మరియు ఏఐ అభివృద్ధి మరియు వినియోగాన్ని వేగవంతం చేసే వ్యవస్థను నిర్మించడంలో ఈ భాగస్వామ్యం కీలక మైలురాయిగా నిలుస్తుంది.



