బిజినెస్

భారతదేశం ఎంతగానో ఇష్టపడే చేనేత వస్త్రాలను ఉతకడానికి, సంరక్షించడానికి సరైన విధానం

భారత దేశంలోని చేనేత వస్త్రాలు కేవలం బట్టలు మాత్రమే కాదు.. అవి కథలు, నైపుణ్యం మరియు అనుభూతులతో అల్లిన సజీవ సంప్రదాయాలు. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన చేనేత సంప్రదాయం ఉంది

భారత దేశంలోని చేనేత వస్త్రాలు కేవలం బట్టలు మాత్రమే కాదు.. అవి కథలు, నైపుణ్యం మరియు అనుభూతులతో అల్లిన సజీవ సంప్రదాయాలు. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన చేనేత సంప్రదాయం ఉంది. మహారాష్ట్ర నుండి పైథాని, గుజరాత్ మరియు రాజస్థాన్ నుండి బంధాని, లక్నో నుండి చికంకారి, కేరళ నుండి కసావు, కర్ణాటక నుండి మైసూర్ సిల్క్, తెలంగాణ నుండి పోచంపల్లి ఇక్కత్, అస్సాం నుండి ముగా సిల్క్ ఇలా మరెన్నో ఉన్నాయి. అయితే, ఈ వస్త్రాలు చాలా సున్నితమైనవని మరియు వీటిని మేనేజ్ చేయడం కష్టమని భావించడం వల్ల, చాలామంది వీటిని నిత్యం ధరించడానికి వెనకాడుతుంటారు. ఈ చేనేత సంప్రదాయాలను కాపాడుకోవడం మన ఇంటి నుండే ప్రారంభమవుతుంది. సరైన పద్ధతిలో ఉతకడం ద్వారా ఇవి ఎక్కువ కాలం మన్నేలా చూసుకోవచ్చు. మీకు ఇష్టమైన చేనేత దుస్తులను జాగ్రత్తగా చూసుకోవడానికి గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన అప్లయన్సెస్ బిజినెస్ వాషింగ్ మెషీన్స్ విభాగం హెడ్ మనీష్ శర్మ కొన్ని సులభమైన మరియు వస్త్రాలకు మేలు చేసే వాష్ టిప్స్ పంచుకున్నారు.

ఉతికే ముందు వస్త్రం రకాన్ని బట్టి వేరు చేయండి

చేనేత వస్త్రాలు రకరకాలుగా ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కో రకమైన నేత, దారం, రంగు అద్దే పద్ధతి ఉంటుంది. వీటిలో చాలా వరకు చాలా సున్నితంగా ఉంటాయి. వస్త్రం మెరుపు, నాణ్యత తగ్గకుండా ఉండాలంటే ముందుగా ఆ వస్త్రం ఎలాంటిదో తెలుసుకోవాలి. దుస్తులకు ఉండే లేబుల్‌ను తప్పనిసరిగా గమనించండి. ఎందుకంటే అన్ని చేనేత వస్త్రాలు మెషిన్ వాష్‌కు పనికిరావు. ముఖ్యంగా క్లిష్టమైన డిజైన్లు ఉన్నవి లేదా రంగులు విడిచే బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

డ్రమ్ నిండుగా బట్టలు వేయకండి

ఉతికే సమయంలో చేనేత వస్త్రాలు ఫ్రీగా కదలడానికి తగినంత ఖాళీ అవసరం. మెషిన్ నిండా బట్టలు వేయడం వల్ల అవి ఒకదానికొకటి చుట్టుకుపోవడం, ముడతలు పడటం లేదా దారాలు రాపిడికి గురై పాడయ్యే అవకాశం ఉంటుంది. చేనేత దుస్తులను విడిగా లేదా ఇతర తేలికపాటి బట్టలతో కలిపి మాత్రమే ఉతకాలి. ఇలా తగినంత ఖాళీ ఇవ్వడం వల్ల దారాలపై ఒత్తిడి తగ్గి, వస్త్రం సహజ ఆకృతి దెబ్బతినకుండా ఉంటుంది.

సాధారణ నీటి ఉష్ణోగ్రత, తక్కువ ఘాటున్న డిటర్జెంట్‌ను వాడండి

వేడి నీటి వల్ల సహజ సిద్ధమైన దారాలు బలహీనపడతాయి. దీనివల్ల మీ చేనేత దుస్తులు ముడుచుకుపోవడం లేదా రంగు వెలిసిపోవడం వంటివి జరుగుతాయి. అందుకే ఎప్పుడూ 20 – 25 డిగ్రీల సెల్సియల్ మధ్య ఉండే సాధారణ వేడి నీటినే వాడాలి. ఎక్కువ ఘాటున్న డిటర్జెంట్లు లేదా బ్లీచ్ వంటివి చేనేత వస్త్రాలకు అస్సలు మంచివి కావు. కాబట్టి బట్టల రంగు, దారం పాడవకుండా ఉండాలంటే తక్కువ ఘాటున్న (మైల్డ్) డిటర్జెంట్‌ను ఎంచుకోవడమే ఉత్తమం.

చేనేత వస్త్రాలను ఉతికేటప్పుడు ఎల్లప్పుడూ జెంటిల్ వాష్ ఫీచర్‌ను ఎంచుకోండి

మీ బట్టలు ఉతికేటప్పుడు ఎల్లప్పుడూ జెంటిల్ వాష్ మోడ్‌ను మాత్రమే ఎంచుకోవాలి. చేనేత వస్త్రాల సున్నితమైన నేతను కాపాడటానికి, అవి పాడవకుండా ఉండటానికి తక్కువ వేగంతో ఉతకడం చాలా ముఖ్యం. చేనేత దుస్తులకు సరిపోయే జెంటిల్ కేర్ ప్రోగ్రామ్ ఉన్న వాషింగ్ మెషీన్‌ను ఎంచుకోండి. ఆ వాషింగ్ మెషీన్ చేనేత వస్త్రాలను ఉతకడానికి అనువైనదిగా ఉండాలి. వివిధ రకాల చేనేత బట్టలను ఎంతో జాగ్రత్తగా శుభ్రం చేసేలా రూపొంది ఉండాలి.

ఉతికినంత జాగ్రత్తగా ఆరబెట్టడమూ ముఖ్యమే

బట్టల నుండి నీటిని తీసివేయడానికి వాటిని బలంగా పిండడం లేదా మెలితిప్పడం వంటివి చేయకండి. ఇలా చేయడం వల్ల నేత‌లోని పోగులు గజిబిజిగా మారి, దారాలు దెబ్బతింటాయి. దీనికి బదులుగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లలో ఉండే తక్కువ వేగంతో తిరిగే జెంటిల్ స్పిన్ సైకిల్‌ను ఎంచుకోండి. ఇది వస్త్రం ఆకృతి దెబ్బతినకుండా అదనపు తేమను జాగ్రత్తగా తొలగిస్తుంది. ఉతికిన తర్వాత చేనేత వస్త్రాలను ఎల్లప్పుడూ నీడలో, గాలి తగిలే ప్రదేశంలోనే ఆరబెట్టాలి. ఎక్కువ సేపు నేరుగా ఎండలో ఉంచడం వల్ల రంగులు వెలిసిపోవడమే కాకుండా, కాలక్రమేణా వస్త్రం బలహీనపడి దాని మన్నిక తగ్గిపోతుంది. కొత్త సాంకేతికతతో చేనేత వస్త్రాల సంరక్షణ ఇప్పుడు ఎంతో సులభంగా, నమ్మదగినదిగా మారింది. అందుకే వీటిని కేవలం దాచుకోకుండా, మన సంప్రదాయంపై గర్వంతో ఎప్పుడైనా ధరించవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *