మూసీ చెలిమెల నీళ్లు తాగిన అరుదైన జ్ఞాపకం

0
37

మూసీ ముచ్చట్లు – 01

అవును మీరు చదివింది నిజమే. నేను అయిదవ తరగతిలో ఉండగా మూసీ నది చెలిమెల్లో నీళ్లు తాగిన జ్ఞాపకం ఇప్పటికీ సజీవంగా నా కళ్ల ముందే కదలాడుతోంది. ఇప్పుడు మా ఊరిలో పారే మూసీని చూసిన ఎవరు కూడా ఈ విషయాన్ని నమ్మే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయిలో మూసీ కంపు కొడుతోంది. అనంతగిరి కొండల్లో పుట్టిన హైదరాబాద్ నగరం మీదుగా నల్గొండ జిల్లాలో గలగలా పారుతూ వెళ్లి కృష్ణమ్మలో కలిసే మూసీ మా ప్రాంత వాసులకు అమ్మలాంటిది. చిన్నప్పుడు బడికి సెలవు వస్తే చాలు బర్లను కొట్టుకొని కాల్వకింది పొలానికి పోయేటోళ్లం. పొద్దున నుంచి చెలకల్లో కడుపు నిండా పచ్చిగడ్డి మేసిన బర్లను మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మూసీ కాలువలకు కొట్టుకెళ్లేటోల్లం. ఆ చల్లని నీళ్లల్లో బర్లు ఉన్నంత సేపు మాకు పండగే. సెలవు రోజున బర్ల కాడికి వచ్చామనే బాధని మర్చిపోయి మేం కూడా గంటల కొద్దీ ఆ నీళ్లలో ఆడుకునేటోళ్లం. కల్వర్టు మీద నుంచి కాల్వలో దుంకి ఈతలు కొడుతుంటే… కాలం ఇట్టే గడిచిపోయేది. అబ్బా… ఇంక జరంత సేపు బర్లు కాల్వలోనుంచి బయటకు రాకుంటే బాగుండు అని వాటిని ఒక కంట సూసుకుంటనే దోస్తులతో నీళ్లల్ల గమ్మతైన ఆటలు ఆడుతుంటిమి.

మా ఊరు సంగెం. వలిగొండ మండలం. ఇప్పుడు బోనగిరి జిల్లా. మా ఊరి మీద నుంచి మూసీ పోతుంది. పెద్ద కత్వ. కిలోమీటరు పొడవుంటదేమో. వానాకాలంలో యేరు వస్తుందని తెలిస్తే మా ఊరోళ్లు సగం మంది ఆడనే ఉంటుండే. కత్వ దుకుతుంటే కళ్లు పెద్దవి చేసుకొని చూసేటోళ్లం. యేరొచ్చిన సప్పుడు ఊర్ల దాకా యినిపిస్తుండే. మా ఊర్లకు ఎవలన్న దోస్తులు వస్తే కూడా ఎట్లకు తీస్కపోయి… ఇగో చూడండి… మా ఊర్ల యేరు ఎంత పెద్దదో అని సూపిస్తుంటిమి. మస్తు గర్వంగా అనిపించేది.
ఎండాకాలంల గూడా మా ఊరి జనాలు కాల్వ కిందికి పోతే ఇప్పటి లెక్క నీళ్లు సీసాలల్ల తీస్కపోయేటోళ్లు కాదు. ఏడ ఇసుకల తవ్వినా నీళ్లు వచ్చేవి. చెలిమల నీళ్లు తాగితే శానా కమ్మగుండేవి. నేను కూడ అట్ల నాలుగైదు సార్లు చెలిమల నీళ్లు తాగిన. బావుల కాడ భూములల్ల నీళ్లు ఉప్పగ ఉంటుండే. బోర్లు వేసినా శానా సార్లు నీళ్లు పడకుండే. కానీ కాల్వకింద భూములు ఉన్నోళ్లకు గట్లాంటి ఇబ్బంది లేకుండే. కాల్వల మస్తు నీళ్లు. పంటలు కూడా మంచిగ పండేవి.

బెస్తోళ్లకయితే మస్తు పని. మా మూసీల 20రకాలకు పైగా చేపలు దొరికేవి. రవ్వలు, బొచ్చెలు, మట్టలు, ఇంగ్లికాలు, పాపర్లు, చందమామలు, ఒలకసత్తలు, పరకలు.. ఇట్ల వల ఏస్తే అట్లా చేపలు పడేవి. పొద్దున్నే బెస్తోళ్ళు గుల్లల నిండా చేపలు ఎత్తుకొని ఊరంత తిరిగి అమ్మేటోళ్లు. శానా అగ్గువ. ఎండ్రకాయలకైతే లెక్కే లేదు. పొలాల పొంటి వరాల మీద దొరికేవి.
కార్తీక పున్నం వస్తే.. ఏడేడ్నుంచో మస్తు మంది స్నానాలు జేయ్యడానికి మా ఏటికాడికి వస్తుండే. పాకుడు పట్టిన కత్వ మీద నుంచి ఒడుపుగా నడుచుకుంటూ వెళ్లి మూసీల స్నానం చేసేటోళ్లు. కత్వ కింద వున్న శివలింగానికి పూజలు చేసి.. శివ లింగాన్ని రెండు చేతులు సాచి హత్తుకునేటోళ్లు. కానీ ఎవరికీ అబ్బక పోయేది ఆ లింగం. అంత పెద్దగా ఉంటది. “అరేయ్.. మూసీ ఎంత పొంగినా.. ఈ మధ్యల వున్న శివలింగం మాత్రం పూర్తిగా మునగదంట.. కొంచమైనా కనబడుతదంట” అని మేము దోస్తులం శానా సార్లు చెప్పుకునేది. ఎవలన్న చనిపోతే బొక్కలు కల్పనీకీ మూసీ కాడికి వచ్చేటోళ్లు. గట్లాంటి కుండలు కనిపిస్తే కొంచెం భయమయ్యేది. ఈ జలాల్లో బొక్కలు కలిపితే సచ్చిపోయినోళ్ల ఆత్మ శాంతిస్తదట.

ఇంతకీ మీకు అసలు విషయం చెప్పలే గదా.. మా ఊరి పేరు కూడా గీ మూసీ నది వళ్లే వచ్చిందట. ఈడ మూసీతో పాటు ఇంకో రెండు వాగులు కలుస్తాయి. అందుకే మా ఊరును త్రివేణి సంగమం అని… చివరకు సంగెమ్ అని పిలవడం మొదలు పెట్టిర్రు. మా బాల్యమంతా మూసీతో ముడివడిన జ్ఞాపకాలే. ఒకప్పుడు మూసీ అంటే మాకు జీవ నది. కడుపులు నింపిన తల్లి. మా ప్రాంతానికి జీవం పోసిన గంగ. ఇప్పుడు నా వయసు 38. కాలంతో పాటు వచ్చిన మార్పులు, కాలుష్యం వల్ల మా తల్లి దగ్గరకు వెళ్ళాలంటే ముక్కు మూసుకోవాల్సిన దురవస్థ. ఈ మార్పుల గురించి మిగతా కథనాల్లో మూసీ వేదన మీతో పంచుకుంటాను.

రాజేందర్​ సురకంటి
సంగెం
మూసీ పరివాహక ప్రాంత వాసి
7036545130
––––––––––––––––––––––––––––––––

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here