
- ఆధార్ రూల్స్‌లో కీలక మార్పులు అమల్లోకి
- పేరు, DOB, అడ్రస్ అప్‌డేట్‌కు కొత్త రుజువులు
- ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నిబంధన కఠినం
ఆధార్ కార్డులోని వివరాల్లో పొరపాట్లు ఉన్నవారికి కీలక సమాచారం. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, భద్రంగా మార్చేందుకు యూఐడీఏఐ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. 2025–26 అసెస్‌మెంట్ ఇయర్‌కు అనుగుణంగా ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలు వివిధ గుర్తింపు పత్రాల్లో ఒక్కోలా ఉండటంతో ప్రజలు బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇకపై ఆధార్ అప్‌డేట్‌కు స్పష్టమైన రుజువులు తప్పనిసరి చేసింది UIDAI.
ఒక వ్యక్తికి ఒకే ఆధార్:
ఇక నుంచి ఒక వ్యక్తి వద్ద ఒకే ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ రెండు ఆధార్ కార్డులు ఉన్నట్లయితే, బయోమెట్రిక్ డేటా ఆధారంగా మొదట జారీ అయిన ఆధార్‌ను మాత్రమే చెల్లుబాటు చేస్తారు. మిగతావి రద్దు అవుతాయి; నకిలీ నెంబర్లు డేటాబేస్ నుంచి తొలగిస్తారు.
అప్‌డేట్‌కు అవసరమైన డాక్యుమెంట్లు:
పేరు లేదా ఫొటో మార్పు కోసం ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన గుర్తింపు పత్రం అవసరం. పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటోతో కూడిన అధికారిక ఐడీలను సమర్పించాలి.
చిరునామా మార్పు కోసం విద్యుత్, నీరు, గ్యాస్ బిల్లులు, బ్యాంక్ పాస్‌బుక్/స్టేట్‌మెంట్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, రిజిస్టర్డ్ అద్దె ఒప్పందం లేదా అధికారిక నివాస ధృవీకరణ పత్రాలు చెల్లుబాటు అవుతాయి.
పుట్టిన తేదీ (DOB) మార్పు ఎలా?:
DOB సరిదిద్దాలంటే జనన ధృవీకరణ పత్రం, విద్యా సర్టిఫికేట్లు లేదా పాస్‌పోర్ట్ వంటి పక్కా రుజువులు అవసరం. ఆధార్ ఖచ్చితత్వాన్ని పెంచేందుకే ఈ కఠినతరం చేసిన నిబంధనలు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానం:
ఆధార్ వివరాలను UIDAI వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ఆధార్ సెంటర్లలో ఆఫ్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే బయోమెట్రిక్ మార్పులు (వేలిముద్రలు, ఐరిస్) కోసం తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. ఇందుకు నిర్ణీత ఫీజు ఉంటుంది.



