ఎయిర్‌పోర్టులో అనుమానం.. చెక్ చేస్తే షాక్! లగేజీలో రూ.4 కోట్ల డ్రగ్స్
భువనేశ్వర్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణికుడి లగేజీ తనిఖీలో హైడ్రోపోనిక్ గాంజా బయటపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఈ డ్రగ్ విలువ కోట్లలో ఉంటుందని అధికారులు తెలిపారు

- భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత
- బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీలో డ్రగ్స్
- DRI దర్యాప్తు, అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌పై అనుమానం
భువనేశ్వర్: ఒడిశా రాజధానిలోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ డ్రగ్ స్మగ్లింగ్ ఘటన వెలుగుచూసింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని ఆపి తనిఖీ చేయగా, లగేజీలో నిషేధిత మత్తు పదార్థం బయటపడింది.
తనిఖీల్లో ప్రయాణికుడి సూట్‌కేస్‌లో సుమారు 3.93 కిలోల హైడ్రోపోనిక్ గాంజా లభ్యమైంది. ఈ డ్రగ్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హైడ్రోపోనిక్ డ్రగ్ అంటే ఏమిటి?:
ఈ గాంజా రకం మట్టిలేకుండా నీటి ఆధారిత పోషకాలతో పండించే హైడ్రోపోనిక్ పద్ధతిలో ఉత్పత్తి చేసినదిగా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇది అత్యంత ఖరీదైన డ్రగ్‌గా పేరుంది.
విచారణలో కీలక అంశాలు:
నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, డ్రగ్ మూలం, సరఫరా మార్గాలు, వెనుక ఉన్న ముఠాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సీజ్‌తో అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక సమాచారం బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
భద్రత కట్టుదిట్టం:
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రగ్ స్మగ్లింగ్ పెరుగుతుందనే సమాచారంతో ఎయిర్‌పోర్ట్‌లలో భద్రతను మరింత కఠినతరం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాగేజ్ స్కానింగ్, ప్రయాణికుల తనిఖీలు పెంచనున్నట్లు స్పష్టం చేశారు.



