ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం
సంగారెడ్డిలో నిరసన చేపట్టిన టీజీఐఐసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయమే చేశారని టీజీఐఐసీ ఛైర్ పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది భీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించారని, ఇద్దరు కేంద్రమంత్రులు అయ్యారన్నారు. ఇంత మంది ఉన్నా సొంత రాష్ట్రానికి నిధులు సాధించలేకపోయారన్నారు. ప్రజలు ఇలాంటి వారిని గెలిపించి ఏం ప్రయోజనమన్నారు. సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ… తమకు ఈసారి బడ్జెట్లో నిధులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు కేంద్రాన్ని విన్నవించారన్నారు. అయినా బడ్జెట్ ప్రస్తావనలో కనీసం తెలంగాణ పేరు లేకుండా చేశారన్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేలా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, సీడీసీ ఛైర్మన్ గడీల రాంరెడ్డి, సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంచందర్ నాయక్, సీనియర్ నేతలు కూన సంతు, కిరణ్, బొంగుల రవి తదితరులు పాల్గొన్నారు.