ఉత్పత్తి చేసేందుకు లండన్ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం
సంగారెడ్డి జిల్లా పోలీసులు అల్ఫ్రాజోలం తయారీ, విక్రేతల గుట్టు రట్టు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.60కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తీగ దొరికితే దానిని లాగిన పోలీసులు డొంకను కదిలించారు. అల్ప్రాజోలం తయారు చేయడం కోసం నిందితులు ఏకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. మెడికల్ పరిశ్రమ కోసం ఇందుకోసం పర్మిషన్ తీసుకున్నారు. రెండు వారాల క్రితం గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో 350 గ్రాముల అల్ఫ్రాజోలం పట్టుకున్న పోలీసులు… విచారించగా ఈ ముఠా గురించి తెలిసింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుధీర్ గౌడ్ ఒడిశాకు చెందిన బిశ్వేశ్వర్ సింగ్ అనే కార్మికుడితో కలిసి అల్ప్రాజోలం తయారీ మొదలుపెట్టాడు. ఇందుకోసం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఒక పాడుపడిన కంపెనీని తీసుకున్నారు. దీని తయారీకి లండన్ లో పీజీ చదువుతున్న ఒక విద్యార్థి సాయం తీసుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అమ్ముతున్నారు. ఇలా ఒక్క ఏడాదిలోనే రూ.20కోట్లు సంపాదించారు. విల్లాలు, భూములు కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు ఆల్ఫాజోలం సరఫరా చేసి రూ.60 కోట్ల వరకు సంపాదించారని ఎస్పీ రూపేష్ వివరించారు.
కుటుంబసభ్యుల భాగస్వామ్యం
ఈ అక్రమ వ్యాపారంలో సుధీర్ గౌడ్ తన భార్య శ్రీవాణి, తమ్ముడు ప్రవీణ్ గౌడ్ లనూ భాగస్వాములను చేశారు. పోలీసులు ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. తొమ్మిది మంది పరారీలోఉన్నారు. గిర్మగాని సుధీర్ గౌడ్, బిశ్వేశ్వర్ సింగ్ (ఒడిశా), రాజేశ్వర శర్మ జోషి (ముత్తంగి), గిర్మగాని శ్రీవాణి, బోడ శశికుమార్ (నల్గొండ), గిర్మగాని ప్రభు గౌడ్, వట్పల్లి సంగమేశ్వర్ గౌడ్ (మెదక్), సుధాకర్ (కూచన్ పల్లి), కలాలి అశోక్ గౌడ్ (ముదిమాణిక్యం), లింగన్నగారి నారాయణ గౌడ్ (తాలెల్మ), సాయిలు (గడిపెద్దాపూర్) అరెస్టయిన వారి జాబితాలో ఉన్నారు.