పెరిగిన వాయు కాలుష్యంతో వీర్య కణాలపై ఎఫెక్ట్..
ముంబై వేదికగా ఇందిరా ఐవీఎఫ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వాయు కాలుష్యానికి పురుషుల వంధ్యత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తేలింది.

ముంబై వేదికగా ఇందిరా ఐవీఎఫ్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వాయు కాలుష్యానికి పురుషుల వంధ్యత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా గాలి నాణ్యత సూచీ (AQI) 151 కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే పురుషులలో సాధారణ వీర్య కణాల సమగ్రత 11 శాతం మేర తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది.
పర్యావరణ కాలుష్యం వీర్య కణాల డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ మధ్య సంబంధాన్ని అంచనా వేస్తూ నిర్వహించిన ఈ అధ్యయనం పారిశ్రామిక నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా పురుషులలో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయని స్పష్టం చేస్తోంది. గాలి నాణ్యత క్షీణించే కొద్దీ అసాధారణ వీర్య కణాల సంఖ్య పెరగడం ఆరోగ్యకరమైన కణాల సంఖ్య తగ్గడాన్ని పరిశోధకులు పొల్యూషన్ బయాస్ అని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం జరిగిన ఈ విశ్లేషణలో కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో 69.3 శాతం వీర్య కణాలు సాధారణంగా ఉండగా కాలుష్యం పెరిగే కొద్దీ ఈ స్థాయి పడిపోతూ వచ్చింది. మధ్యస్థ కాలుష్యం ఉన్న చోట 8.8 శాతం అధిక కాలుష్యం ఉన్న చోట 11 శాతం మేర ఆరోగ్యకరమైన వీర్య కణాల క్షీణత కనిపించింది.
ఈ పరిశోధన ఫలితాల గురించి ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ లిమిటెడ్ సీఈఓ డాక్టర్ క్షితిజ్ ముర్డియా మాట్లాడుతూ పర్యావరణంలోని విషతుల్యాలు కేవలం సంతానోత్పత్తికే కాకుండా పిండం యొక్క ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 120 ఇందిరా ఐవీఎఫ్ కేంద్రాల్లో 21 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల 3,222 మంది పురుషులపై ఈ అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా చూసే వీర్య కణాల సంఖ్య లేదా కదలికల కంటే ఈ అధ్యయనంలో ప్రధానంగా డీఎన్ఏ సమగ్రతపై దృష్టి సారించామని చీఫ్ ఆఫ్ క్లినికల్ అండ్ ల్యాబ్ ఆపరేషన్స్ డాక్టర్ విపిన్ చంద్ర తెలిపారు. పెరుగుతున్న కాలుష్య స్థాయిలు వీర్య కణాలలోని జన్యు నిర్మాణాన్ని దెబ్బతీస్తూ పురుషులలో వంధ్యత్వానికి ప్రధాన కారణంగా మారుతున్నాయని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.



