ఇంద్రేశంలో కాంగ్రెస్ జోరు.. అభ్యర్థుల గెలుపు కోసం నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ ప్రచారం

ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గురువారం ఇక్కడ విస్తృతంగా పర్యటించారు. మున్సిపాలిటీలోని 15వ వార్డు బచ్చుగుడాలో కాంగ్రెస్ అభ్యర్థి సరిత తరపున వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంద్రేశం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 15 కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదించిందని, అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే నిధులతో మౌలిక వసతులు మెరుగుపడతాయని వారు పేర్కొన్నారు. ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
కాగా, ఈ ప్రచార సభలో పలువురు స్థానిక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరుణాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి సహా సుమారు 40 మందికి నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన జయా చైతన్య రెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా జయా గుణ చైతన్య రెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డులలో తిరుగుతూ… హస్తం గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులు చేసి పెట్టే బాధ్యత జగ్గారెడ్డి చూసుకుంటారని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతారని ఆమె వివరించారు.



