టెక్నాలజీ

ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్, ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ జట్టు

ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక విద్యుత్ ఆధారిత భారీ స్థాయి ఏఐ కంప్యూట్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసేందుకు ఓఎక్స్‌ఎంఐక్యూ (OXMIQ Labs), ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ) వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.

హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక విద్యుత్ ఆధారిత భారీ స్థాయి ఏఐ కంప్యూట్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసేందుకు ఓఎక్స్‌ఎంఐక్యూ (OXMIQ Labs), ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ) వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 2030 నాటికి 2 గిగావాట్ ఏఐ కంప్యూట్ సామర్థ్యం ఏర్పాటు చేయడం లక్ష్యం కాగా, మొదటి దశలో 1 గిగావాట్ హబ్‌ను నోయిడాలో ఏర్పాటు చేయనున్నారు. దీని విద్యుత్ వ్యయాలు సంప్రదాయ డేటా సెంటర్ విద్యుత్ వ్యయాలతో పోలిస్తే 50-70 శాతం తక్కువగా ఉండనున్నాయి. ఈ హబ్ పూర్తిగా సమగ్ర ఏఐ మౌలిక వేదికగా ఉండనుంది.

స్వంత విద్యుత్ ఉత్పత్తి నుంచి డేటా సెంటర్, ఏఐ ప్రాసెసర్లు, సాఫ్ట్‌వేర్ వరకు ఒకే వ్యవస్థగా రూపుదిద్దుకోనుంది. ఈ ఒప్పందం కింద కంప్యూట్ ప్లాట్‌ఫాంకి సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ భాగస్వామిగా ఓఎక్స్ఎంఐక్యూ వ్యవహరిస్తుంది. ఆర్కిటెక్చర్, హార్డ్‌వేర్ రోడ్‌మ్యాప్, సప్లై చెయిన్ వ్యూహాలను డిజైన్‌ చేయడంలో ఏఎంఐ ల్యాబ్స్‌తో కలిసి పని చేస్తుంది. ఇప్పటికే నోయిడాలో తొలి దశ కంప్యూట్ హబ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రాథమిక కంప్యూట్ సామర్థ్యం 2027 నాటికి అందుబాటులోకి రాగలదు. పర్యావరణహిత విద్యుత్ దిగ్గజం గ్రీన్‌కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్‌లో ఏఎంఐ ల్యాబ్స్ భాగంగా ఉంది. జీపీయూ ఆర్కిటెక్చర్, ఏఐ టెక్నాలజీ కంపెనీ అయిన ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్‌ని రాజా కోడూరి ఏర్పాటు చేశారు.

“హార్డ్‌వేర్, సిస్టమ్స్‌పరంగా ఓఎక్స్ఎంఐక్యూకి ఉన్న అనుభవం ఏఎంఐ ల్యాబ్స్‌కి తోడ్పడుతుంది. అగ్రగామి సిలికాన్ వేలీ కంపెనీలకి సేవలందించడంలో వారి బృందానికి ఉన్న అనుభవం మేము అంతర్జాతీయంగా పోటీపడే మౌలిక సదుపాయాలను నిర్మించడంలో సహాయకరంగా ఉంటుంది. ఏఎంఐ ల్యాబ్స్ పూర్తి స్థాయి ఏఐ కంప్యూట్ ప్లాట్‌ఫాంగా ఎదిగేందుకు మేము సమిష్టిగా పునాది వేస్తున్నాం” అని ఏఎం గ్రూప్ యొక్క గ్రూప్ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు.

“ఓఎక్స్ఎంఐక్యూకి ఏఐంఐ ల్యాబ్స్ సరైన భాగస్వామి. వారు గ్లోబల్ స్థాయిలో విశ్వసనీయమైన విధంగా, కర్బన రహిత విద్యుత్తును అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన కంప్యూటింగ్ ప్లాట్‌ఫాంలకు దన్నుగా నిలిచే సిలికాన్, సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్‌ని నిర్మించడంలో మా బృందం దశాబ్దాలుగా కృషి చేస్తోంది” అని ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో రాజా కోడూరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *