Sangareddy: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి.. 176 మంది అభ్యర్థులు తుది బరిలో
సంగారెడ్డి మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది.

సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది. మొత్తం 38 వార్డులకు గాను దాఖలైన 226 నామినేషన్లలో 50 మంది తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నట్లు మున్సిపల్ ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం తుది బరిలో 176 మంది అభ్యర్థులు నిలిచారు.
పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 11, బీజేపీ నుంచి 10, కాంగ్రెస్ నుంచి 6, 23 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని చల్లార్చడంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజయవంతమయ్యారు. ఆయన పిలుపు మేరకు 22, 4, 21, 18, 16, 5వ వార్డులకు చెందిన పలువురు ఆశావహులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా 22వ వార్డు నుంచి శివుడు, సిద్ధు, 5వ వార్డు నుంచి అమీర్ బేగ్ వంటి కీలక నేతలు తప్పుకుని, పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల అధికారులు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేశారు.



