తెలంగాణ

Sangareddy: సంపన్న ఖైదీలొస్తే… సంగారెడ్డి జైలులో పండగే!

సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ఉన్న కేంద్ర కారాగారంలో కొందరి తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంపన్నులైన ఖైదీలు వస్తే, భారీగా డబ్బులు తీసుకొని, రాచమర్యాదలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.

  • ములాఖత్​ మొదలు భోజనం వరకు ప్రత్యేక ఏర్పాట్లు
    చేస్తున్నట్లుగా ఆరోపణలు
  • దర్జాగా దందా సాగిస్తున్నారంటూ
    కొందరి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • ఖైదీల బంధువులు, స్నేహితుల నుంచి వసూళ్ల కోసం
    నమ్మకమైన సిబ్బందికి ప్రత్యేకంగా బాధ్యతలు
  • భారీగా డబ్బులు తీసుకొని జైలులో ఉన్న కొందరు
    రిమాండ్​ ఖైదీల సేవలో తరిస్తున్న తీరు
  • ఈ అంశాలపై ఇటీవలి కాలంలో డీఐజీ శ్రీనివాస్​
    రెండు సార్లు విచారణ చేసినట్లు సమాచారం
  • జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా దృష్టికి చేరిన వ్యవహారం
  • గతంలోనూ బెంగళూరుకు చెందిన ఒక ఖరీదైన ఖైదీ నుంచి భారీగా డబ్బులు గుంజిన అధికారులు, సిబ్బంది
  • ఆ వ్యవహారంలో కొందరిపై అప్పట్లోనే సస్పెన్షన్​ వేటు

కందిలి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో ఉన్న కేంద్ర కారాగారంలో కొందరి తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంపన్నులైన ఖైదీలు వస్తే, భారీగా డబ్బులు తీసుకొని, రాచమర్యాదలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ములాఖత్​ మొదలు భోజనం వరకు ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెస్తుండటమే ఇందుకు కారణం. ఈ అంశాలన్నీ ఉన్నతాధికారుల వరకూ వెళ్లాయి. దీంతో రెండు నెలల వ్యవధిలో డీఐజీ శ్రీనివాస్​ రెండు సార్లు ఈ కారాగారానికి వచ్చారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా దృష్టికీ ఈ వ్యవహారం వెళ్లింది.

డబ్బులు తీసుకుంటూ.. ప్రత్యేకంగా సేవలు!
సంగారెడ్డి కేంద్ర కారాగారంలో ప్రస్తుతం కొందరు సంపన్న ఖైదీలున్నారు. వీరికి ములాఖత్​ మొదలు భోజనం వరకు అన్నీ ప్రత్యేక సేవలు అందుతున్నట్లు సమాచారం. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ, కోరిన సేవలు కల్పించడంలో కొందరు తరించిపోతున్నారు. మనకేమీ కాదనే భావనతో దర్జాగా దందా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా ఇవే పనులు చక్కబెట్టేందుకు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. వీరు సంపన్న ఖైదీలతో పాటు ఇతర ఖైదీల బంధువులు, స్నేహితులతో మాట్లాడుతున్నారు. జైలులో ఉన్న మీవాళ్లను బాగా చూసుకుంటామని చెబుతూ అందినకాడికి దండుకుంటున్నారు.

ఒక్కో అమౌంటుకు.. ఒక్కోలా పర్సంటేజీలు!
కొందరు ఒక టీమ్​ గా ఏర్పడ్డారు. ఖైదీల నుంచి వసూలయ్యే మొత్తాన్ని బట్టి ఎవరికెంత పర్సంటేజీ అనే విషయంలో కూడా చాలా స్పష్టమైన విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. రూ.లక్ష వరకు ఒక పర్సంటేజీ, అంతకుమించితే ఒక పర్సంటేజీ అంటూ లెక్కలు కూడా కట్టుకున్నారని తెలుస్తోంది. సంపన్న ఖైదీలు వస్తున్నారంటే చాలు, సంగారెడ్డి జైలులో కొందరు అధికారులు, సిబ్బంది పండగ చేసుకుంటున్న పరిస్థితి.

గతంలో ఇవే వివరాలు.. పొరపాటున బయటపెట్టిన సూపరింటెండెంట్​!
‘‘కొందరు సిబ్బంది ఖైదీలకు సంబంధించిన వారి నుంచి ఫోన్​ పే చేయించుకుంటున్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తాం. ఇంటెలిజెన్స్​ విభాగం నుంచి ఈ డేటా తీసుకున్నాం. జాగ్రత్తగా ఉండండి” అంటూ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్​ కళాసాగర్​ వాట్సాప్​ గ్రూపులో మెసేజ్​ చేశారు. జైలుకు సంబంధించిన వాట్సాప్​ గ్రూపులో కాకుండా ఆయన పొరపాటున వేరే వాట్సాప్​ గ్రూపులో ఈ మెసేజ్​ పోస్ట్​ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇది గ్రహించిన ఆయన కొద్దిసేపటి తర్వాత ఆ మెసేజ్​ డిలీట్​ చేశారు.

అప్పట్లో… బెంగళూరుకు చెందిన ఖైదీ నుంచి!
గతంలో ఇదే తరహాలో కొందరు జైలు అధికారులు, సిబ్బంది కలిసి బెంగళూరుకు చెందిన ఖైదీ నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారు. బెంగళూరులో ఆ ఖైదీకున్న పనులనూ చక్కబెట్టి వచ్చారు. ఇందుకు ప్రతిగా భారీగా డబ్బు తీసుకున్నారు. చివరకు వారి మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయి. విషయం బయటకొచ్చింది. అప్పట్లోనే ఈ అంశమై విచారణ జరిగింది. బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్​ వేటు వేశారు. ప్రస్తుతం కొన్ని నెలలుగా ఇలాంటి వ్యవహారాలే మళ్లీ చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సంపన్న ఖైదీలకు జైలులో ఉన్న ఇతర ఖైదీలను సహాయకులుగా నియమించి మరీ, సేవలు అందిస్తున్న పరిస్థితి.

ఫోన్​ ద్వారా ప్రయత్నించగా..!
ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు, వస్తున్న ఆరోపణలు, ఇటీవల జరిగిన డీఐజీ విచారణ తదితర అంశాలపై కేంద్ర కారాగారం సూపరింటెండెంట్​ కళాసాగర్​ తో ఫోన్లో మాట్లాడేందుకు ‘కందిలి’ ప్రతినిధి ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *