Sangareddy: క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సంగారెడ్డి: అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్యాన్సర్ వ్యాధి పట్ల భయం వీడి, అవగాహన పెంచుకోవాలని ఆమె కోరారు. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వాటిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సతో నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. మహిళలు, యువత క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, చిన్నపాటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
వైద్య నిపుణులు మాట్లాడుతూ, ధూమపానం, పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని వివరించారు. అనంతరం విద్యార్థులు క్యాన్సర్ నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



