తెలంగాణసంగారెడ్డి

Andole: త్వరలో అందోల్‌కు పరిశ్రమలు.. నిరుద్యోగ సమస్యకు శాశ్వతంగా చెక్: మంత్రి దామోదర్ రాజనర్సింహ

మహిళలు, యువత ఆర్థికంగా ఎదగాలంటే కేవలం చదువులపైనే కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు.

అందోల్: మహిళలు, యువత ఆర్థికంగా ఎదగాలంటే కేవలం చదువులపైనే కాకుండా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. అందోలు-జోగిపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అందోల్ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

నైపుణ్యాలు పెంచుకోవాలి..
ఉపాధి కల్పన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యమని చెబుతూ, ఈ ప్రాంతంలో త్వరలోనే నూతన పరిశ్రమలను నెలకొల్పి స్థానిక యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కేవలం ఇంటర్, డిగ్రీ, పీజీ పట్టాలు పొందడమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యంతో కూడిన చదువులకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధిని పొందవచ్చని సూచించారు.

మహిళల స్వయం ఉపాధికి భరోసా
మహిళలు ఆర్థికంగా స్థిరపడటానికి స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని మంత్రి కోరారు. డ్రైక్లీనింగ్ సెంటర్లు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కూరగాయల దుకాణాలు వంటి చిన్న తరహా వ్యాపారాలను ఏర్పాటు చేసుకునే వారికి తన వంతు సహకారం అందిస్తానని భరోసానిచ్చారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలపై స్పందిస్తూ, సంగుపేట చౌరస్తా వద్ద కూరగాయల మార్కెట్ కోసం ప్రత్యేకంగా షెడ్ నిర్మిస్తామని ప్రకటించారు.

వైద్య రంగంలో అభివృద్ధి
ప్రజలకు మెరుగైన మరియు త్వరితగతిన వైద్య సేవలు అందించేందుకు అందోలు శివారులో 150 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఆర్టీసీ బస్సుల నిలుపుదల, ఇతర స్థానిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫేడ్ డైరెక్టర్ ఎస్. జగన్మోహన్ రెడ్డి, పీసీసీ సభ్యుడు గజ్జడ కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *