GMR: కాంగ్రెస్ పార్టీలో చేరినా.. ఎంటిక మందం లాభం జరగలేదు!
‘‘అప్పుడున్న పరిస్థితుల్లో ఒక తప్పటడుగు వేశాను. అయినా నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు, నాకు ఎంటిక మందం లాభం కూడా జరగలేదు. అన్నీ కోర్టుల ద్వారానే చూసుకుంటున్నా’’మని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

* అన్ని విషయాలూ కోర్టు ద్వారానే చూసుకుంటున్నాం
* అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక తప్పటడుగు వేశాను
* అయినా నియోజకవర్గ ప్రజలకు, నాకు ఎలాంటి లాభం లేకుండా పోయింది
* బీఆర్ఎస్ పార్టీ మూడు సార్లు నాకు టికెటిచ్చింది.. మీ అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించారు
* పటాన్ చెరు పరిధిలో అయిదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేద్దాం
* మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కందిలి, పటాన్ చెరు
‘‘అప్పుడున్న పరిస్థితుల్లో ఒక తప్పటడుగు వేశాను. అయినా నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు, నాకు ఎంటిక మందం లాభం కూడా జరగలేదు. అన్నీ కోర్టుల ద్వారానే చూసుకుంటున్నా’’మని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆదివారం ఆయన సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చకు తావిచ్చాయి.
మూడు సార్లు బీఆర్ఎస్ టికెటిచ్చింది!
‘‘నాకు మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీ టికెటిచ్చింది. మీ అందరి ఆశీర్వాదాలతో నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అందుకే ఆలోచన చేశాను. ఇప్పుడు అయిదు మున్సిపాలిటీల్లో 104 మంది కౌన్సిలర్ స్థానాలున్నాయి. మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగ్, పెద్దమనుషుల పరంగా ఒక వింగ్, కులసంఘాల వారీగా ఒక వింగ్.. ఇలా అన్ని కేటగిరీల వారీగా విభజిద్దాం. ఈ అయిదు మున్సిపాలిటీల్లో మనకున్న సత్సంబంధాలను వాడుకుందా’’మని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివరించారు. కన్నతల్లిదండ్రుల వంటి పార్టీ అయిన బీఆర్ఎస్ విజయం కోసం కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ మారుతారంటూ.. గత కొంతకాలంగా ప్రచారం!
మూడోసారి బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి, తన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగు చూశాక అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అనర్హత పిటిషన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యమిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దయెత్తున గొడవలకూ దిగారు. ఇటీవల గూడెం మధుసూదన్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. కొల్లూరులో జరిగిన కార్యక్రమానికి హాజరుకావడం, నూతన సంవత్సరం సందర్భంగా హరీశ్ రావును కలవడం, ఆయన కాళ్లు మొక్కడం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆసక్తిరేపుతున్నాయి. ఇకపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గూడెం మహిపాల్ రెడ్డి కార్యకలాపాలు నిర్వహిస్తారనే అంశమై స్పష్టత వచ్చింది.



