తెలంగాణమెదక్

BRS: “ఎన్ని నోటీసులు ఇచ్చినా నిన్ను వదిలిపెట్టం..” రేవంత్ రెడ్డి సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు

అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టినందుకు తనపై, కేటీఆర్ గారిపై ప్రభుత్వం కక్షపూరితంగా సిట్ (SIT) నోటీసులు పంపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు.

మెదక్: అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టినందుకు తనపై, కేటీఆర్ గారిపై ప్రభుత్వం కక్షపూరితంగా సిట్ (SIT) నోటీసులు పంపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. గురువారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

నోటీసులకు భయపడ: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాకనే ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. “నువ్వు పంపే నోటీసులు మాకు ప్రేమ లేఖల్లాంటివి. ఎన్ని కేసులు పెట్టినా, చివరి హామీ నెరవేరే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటాం” అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మెదక్ అభివృద్ధి – కేసీఆర్ మార్క్: 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మెదక్ జిల్లా కల నెరవేరలేదని, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక మెదక్ ను జిల్లా చేయడమే కాకుండా.. మెడికల్ కాలేజీ, రైలు, కలెక్టరేట్, ఇంటింటికీ మంజీరా జలాలు తెచ్చారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయాంలో క్రాప్ హాలిడే: పదేళ్లు నీళ్లతో కళకళలాడిన ఘనపురం ప్రాజెక్టు నేడు కాంగ్రెస్ అసమర్థత వల్ల ఎండిపోయిందని, రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బకాయిల లెక్కలు:

  • మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ. 62,500 బాకీ పడ్డారు.
  • అవ్వతాతలకు రూ. 50 వేల పెన్షన్ బకాయి ఉంది.
  • మైనార్టీలకు రూ. 4000 కోట్ల బడ్జెట్ అబద్ధమని తేలిపోయింది.

బ్యాంక్ అకౌంట్లపై రేవంత్ కన్ను: ట్రాఫిక్ చలాన్ల పేరుతో ప్రజల అకౌంట్ల నుండి నేరుగా డబ్బులు కట్ చేస్తామనడం దారుణమని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా సైబర్ నేరగానిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

మెదక్ జిల్లాను రద్దు చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నారని, జిల్లా అస్తిత్వం కాపాడాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *