Sangareddy: నేను పాలిచ్చే ఆవును.. నన్ను కాపాడుకుంటే పట్టణాన్ని అభివృద్ధి చేస్తా – జగ్గారెడ్డి
"నేను మీకు రోజూ పాలిచ్చే ఆవును.. నన్ను కాపాడుకోండి" అంటూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలకు ఉద్వేగభరితమైన పిలుపునిచ్చారు.

సంగారెడ్డి: “నేను మీకు రోజూ పాలిచ్చే ఆవును.. నన్ను కాపాడుకోండి” అంటూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలకు ఉద్వేగభరితమైన పిలుపునిచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని 15 వేల మంది ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి సభలో ఆయన ప్రసంగించారు. మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే, తాను ముందుండి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున, మొత్తం రూ. 300 కోట్లతో సంగారెడ్డి పట్టణ రూపురేఖలు మారుస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ ప్రజల పనులు చేయిస్తున్నానని, భవిష్యత్తులోనూ అదే విధంగా కొనసాగిస్తానని తెలిపారు.
ప్రధానంగా ఇళ్ల స్థలాల విషయంలో ఆయన కీలక హామీ ఇచ్చారు. గతంలో 5500 మందికి ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చామని గుర్తు చేస్తూ, ఇప్పుడు స్థలాలు లేని మిగతా వారికి కూడా 80 గజాల చొప్పున ఇప్పిస్తానని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.



