తెలంగాణసంగారెడ్డి

Jaggareddy: నిమ్మ సోడా తాగి.. లక్ష రూపాయల సాయం చేసిన జగ్గారెడ్డి

సదాశివపేటలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనదైన శైలిలో ఉదారత చాటుకున్నారు

సదాశివపేటలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనదైన శైలిలో ఉదారత చాటుకున్నారు. గురువారం పట్టణంలో పర్యటిస్తున్న ఆయన, రోడ్డు పక్కన నిమ్మ సోడా అమ్ముతున్న ఒక మహిళ కష్టాన్ని చూసి చలించిపోయారు. ఆమెతో ముచ్చటించి, వ్యాపార అభివృద్ధి కోసం అక్కడికక్కడే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్న క్రమంలో, కొత్త సోడా మెషిన్ కొనుక్కుంటే ఎండాకాలంలో రోజుకు మూడు వేల రూపాయల వరకు సంపాదన వస్తుందని ఆ మహిళ తెలిపింది. దీంతో జగ్గారెడ్డి వెంటనే తన జేబులోంచి లక్ష రూపాయలు తీసి ఆమెకు అందజేశారు. “ఆ దేవుడు ఆదేశించాడు, అందుకే నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చి నీకు సాయం చేస్తున్నా. ఈ డబ్బుతో మంచి మెషిన్ కొనుక్కొని వ్యాపారం వృద్ధి చేసుకో” అని ఆమెకు ధైర్యం చెప్పారు.

కష్టాల్లో ఉన్నవారిని చూడగానే స్పందించే గుణం తన తల్లిదండ్రుల నుంచి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఊహించని విధంగా అందిన ఈ భారీ సాయానికి ఆ మహిళ సంతోషంతో జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.

వారిరువురి మధ్య సంభాషణ ఉన్నది ఉన్నట్లు…

జగ్గారెడ్డి: ఏమ్మా.. ఎట్లుంది వ్యాపారం? మంచిగా జరుగుతోందా?

మహిళ: ఏదో అట్లా సాగుతోంది సార్. ఇప్పుడున్న బండితో ఏమీ మిగలడం లేదు. కొత్త సోడా మెషిన్ కొనుక్కుంటే గిరాకీ ఎక్కువవుతుంది. మీరు ఏదైనా సాయం చేస్తే బండిని మంచిగా నడుపుకుంటాం సార్.

జగ్గారెడ్డి: అవునా.. అయితే ఎన్ని డబ్బులు ఉంటే కొత్త మెషిన్ వస్తుంది? మీరు మంచిగా బతకడానికి ఎంత కావాలి?

మహిళ: లక్ష రూపాయలు ఉంటే కొత్త మెషిన్ వస్తుంది సార్. ఈ ఎండాకాలంలో రోజుకు మూడు వేల రూపాయల దాకా వ్యాపారం అవుతుంది. మీరు సాయం చేస్తే మేము మంచిగా బతుకుతాం.

జగ్గారెడ్డి: (వెంటనే జేబులోంచి లక్ష రూపాయలు తీసి ఇస్తూ..) ఇదిగో ఈ లక్ష రూపాయలు తీసుకో. ఎండాకాలం వచ్చేలోగా మంచి సోడాల మెషిన్ కొనుక్కో. రోజుకు మూడు వేలు సంపాదించుకొని మీ కుటుంబం బాగుండాలి.

మహిళ: (ఆశ్చర్యంతో) అయ్యో సార్.. అప్పుడే ఇచ్చేస్తున్నారా? చాలా థాంక్స్ సార్.

జగ్గారెడ్డి: ఆ దేవుడు ఆదేశించిండు.. అందుకే నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చి నీకు సాయం చేసినా. ఈరోజు నా ద్వారా నీకు మేలు జరగాలని రాసిపెట్టి ఉంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే స్పందించే గుణం మా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. ఈ పైసలతో మంచిగా వ్యాపారం చేసుకోమ్మా.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *