తెలంగాణ చరిత్రపై మరిన్ని పరిశోధనాత్మక నవలలు రావాలి: కేసీఆర్
తెలంగాణ తరగని చారిత్రక గని అని, అనేక చారిత్రక పరిశోకధక నవలలు ఈ ప్రాంతం నుంచి రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు

తెలంగాణ తరగని చారిత్రక గని అని, అనేక చారిత్రక పరిశోకధక నవలలు ఈ ప్రాంతం నుంచి రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. పరిశోధక రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన కొండమల్లు నవలను నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తితో కలిసి వెంకటేశ్వర్లు గురువారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాస గృహంలో కేసీఆర్ కు అందించారు.
సాహిత్యకారుల అవసరం..
800 ఏళ్లనాటి పలనాటి సీమ చారిత్రక, చెంచు సామాజిక అంశాలను కొత్త దృష్టితో, మరికొంత పరిశోధనతో రాసిన నవల మూల కథను కేసీఆర్ అడిగి ఆసక్తిగా విన్నారు. నల్లగొండ, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి మొదలై ఆంధ్ర,రాయలసీమ వరకు విస్తరించిన నల్లమల చెంచుల జీవనం సంస్కృతి, ప్రస్తుతం వారి అవసరాలను కేసీఆర్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వీలుచుసుకొని నవల చదువుతానని చెప్పారు. తెలంగాణకు వర్ధమాన సాహిత్యకారుల అవసరం ఉన్నదని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు అభినందించారు. భవిష్యత్తుతో తెలంగాణ చారిత్రక అంశాల మీద దృష్టి సారించి నవలా రాయాలని సూచించారు.
రాజధానిని విస్తరించాలనే ఆకాంక్షతో చెంచు పెంటల మీద బ్రహ్మనాయుడు సైన్యాలు దండెత్తడం, దెబ్బతిన్న చెంచుల నాయకుడు బయ్యన్న కారుకోడిని పట్టుకొని, దాన్ని కొండమల్లుగా తీర్చిదిద్ది ప్రతీకారం తీర్చుకోవడమనే చారిత్రక, సామాజిక కథతో ఉత్కంఠగా, ఆసక్తిగా సాగే కొండమల్లు నవలను ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అల్లం నారాయణ, ప్రముఖ నవలాకారులు బండి నారాయణ స్వామి, అట్టాడ అప్పల నాయుడు తదితరులు ఆవిష్కరించారు.



