Patancheru: హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్లోకి కాంగ్రెస్ సీనియర్ నేతల క్యూ
మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

పటాన్చెరు: మున్సిపల్ ఎన్నికల రణక్షేత్రంలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
బిఆర్ఎస్లో చేరిన వారిలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు దేవానందం, యాదగిరి యాదవ్, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి వంటి హేమాహేమీలు ఉన్నారు. అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్లతో పాటు సుమారు 100 మంది కీలక కార్యకర్తలు పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో బిఆర్ఎస్ బలం పుంజుకుంది.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు బిఆర్ఎస్ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.



