తెలంగాణసంగారెడ్డి

CDR: అందోల్‌లో మరిన్ని పరిశ్రమలు.. ఆర్ఆర్‌డీ డిస్టలరీ ప్రారంభం సందర్భంగా మంత్రి దామోదర్

సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.

  • ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి సహకరిస్తాం
  • యువత, మహిళలకు ఉపాధి కల్పించే దిశగా ఇండస్ట్రీలను తీసుకొస్తాం

అందోల్: సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. అందోల్ మండలం పోసానిపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన RRD డిస్టలరీ ని శనివారం.. మంత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, యాజమాన్యంతో మాట్లాడారు.

ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యం
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందోల్ శివారులో మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు. నూతనంగా ప్రారంభమైన RRD డిస్టలరీ ద్వారా స్థానిక ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలు లభించడం శుభపరిణామమన్నారు. భవిష్యత్తులో ఈ పరిశ్రమ మరింత విస్తరించి, మరో 500 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రభుత్వం తరఫున పూర్తి ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.

సాగునీరు, విద్యా, వైద్య రంగాల్లో..
అందోల్ నియోజకవర్గాన్ని కేవలం పారిశ్రామికంగానే కాకుండా, విద్య, వైద్య హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. సాగునీటి రంగంపై మాట్లాడుతూ.. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, రానున్న రోజుల్లో మరో లక్ష ఎకరాల ఆయకట్టకు నీరు అందించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. దీనివల్ల స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు.

పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్ఆర్‌డీ డిస్టలరీ ఎండీ కొండల నిపుణ్ రెడ్డి, డైరెక్టర్ త్రిష, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందోల్, జోగిపేట మున్సిపాలిటీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు కూడా ఈ ప్రారంభోత్సవ వేడుకలో భాగస్వాములయ్యారు. ఈ పరిశ్రమతో అందోల్ రూపురేఖలను మారుతాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *