తెలంగాణ

Singur Dam: సింగూర్ డ్యామ్ భద్రత పనులు త్వరగా చేపట్టండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సింగూర్ డ్యామ్ భద్రతను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు

హైదరాబాద్: సింగూర్ డ్యామ్ భద్రతను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్వయంగా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షిస్తానని ఆయన ప్రకటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి దామోదర రాజనర్సింహలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జంట నగరాల తాగునీటి అవసరాలను, రైతుల సాగునీటి అవసరాలను తీరుస్తున్న సింగూర్ ప్రాజెక్టు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఎన్‌డీఎస్‌ఏ (NDSA) నిపుణుల కమిటీ సూచనల మేరకు మరమ్మతు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, పాలెం వాగు గేట్లు రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

మరోవైపు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. జనగామ నియోజకవర్గంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్ డీ3 కెనాల్ పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించాలని ఆయన కోరారు. రంగనాయక సాగర్ ద్వారా దూళ్మిట్ట చేర్యాల మండలాల్లోని దాదాపు 7 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఎంపీ ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *