బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సహకారం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు.
ఇప్పటికే ఆలయ ఆవరణలో నాలుగు ప్రాకారాల నిర్మాణం పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఆలయ అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా రూ. 50 లక్షలు విరాళంగా అందజేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రధాన గోపురం నిర్మాణానికి కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన మరిన్ని వసతులు కల్పించేందుకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, నాయకులు విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈఓ శశిధర్ తో పాటు కౌన్సిలర్లు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



