Isnapur: ఎన్నికల బరిలోకి నీలం కవిత.. ఇస్నాపూర్‌లో నామినేషన్ దాఖలు
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం కవిత (నీలం మధు ముదిరాజ్ సతీమణి) శుక్రవారం అత్యంత ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు.

సంగారెడ్డి/ఇస్నాపూర్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం కవిత (నీలం మధు ముదిరాజ్ సతీమణి) శుక్రవారం అత్యంత ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. చిట్కుల్‌లోని దుర్గామాత ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలతో ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 4వ వార్డుకు చెందిన వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా నీలం నివాసానికి చేరుకుని కవితకు తమ మద్దతు ప్రకటించారు.
ర్యాలీగా బయల్దేరి..
“కవితను గెలిపించుకోవడం మా బాధ్యత” అంటూ నినదించిన మహిళలు, స్వయంగా నీలం మధు చేతుల మీదుగా నామినేషన్ పత్రాలను కవితకు అందజేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళా లోకమే దగ్గరుండి ఆమెను బరిలోకి దింపడం గమనార్హం. అనంతరం నీలం కవిత అనంతరం ఇస్నాపూర్ ఐలా కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మహిళా ఆశీర్వాదాలు, కార్యకర్తల కష్టం తన గెలుపుకు పునాదులని కవిత ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.



