ప్రజావాణి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత: కలెక్టర్ పి. ప్రావీణ్య
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.

- ప్రజావాణిలో 16 అర్జీలు స్వీకరణ
కందిలి, సంగారెడ్డి
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు మాధురి, పాండు లతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులు భూ సమస్యలు, ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలతో పాటు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యుత్, వ్యవసాయ, విద్య, వైద్య ఆరోగ్య, ఎక్సైజ్, డీడబ్ల్యూఓ, డీసీఎస్ఓ, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్కు అందజేశారు. వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 16 అర్జీలు అందినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును గంభీరంగా తీసుకుని అర్జీదారుల సమస్యలను కాలపరిమితిలో పరిష్కరించాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, కలెక్టరేట్ ఏఓ, ప్రజలు పాల్గొన్నారు.



