Road Accident: దూసుకొచ్చిన ఫ్లెక్సీ ఫ్రేమ్.. అమ్మాయి ప్రాణాలు బలిగొంది!
ట్రాలీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మరికొందరిని తీవ్రగాయాల పాలు చేసింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురం ఆలయం సమీపంలో చోటు చేసుకుంది

* సంగారెడ్డి వైకుంఠపురం ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం
* అతి వేగంగా ఓవర్ టేక్ చేస్తూ బస్సును ఢీకొట్టిన ఆటో డ్రైవర్
* ఫ్లెక్సీ ఫ్రేమ్స్ వచ్చి బస్సుల్లో ఉన్నవారికి గుచ్చుకున్న ఘటన
* తీవ్ర గాయాలపాలై మృత్యువాతపడ్డ ఇంజినీరింగ్ విద్యార్థిని పూజ
* గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్న మంత్రి దామోదర్
కందిలి, సంగారెడ్డి: ట్రాలీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మరికొందరిని తీవ్రగాయాల పాలు చేసింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురం ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందగా, ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ అంశమై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
అతివేగం, నిర్లక్ష్యమే.. ప్రమాదానికి కారణం!
ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వెళ్తోంది. సంగారెడ్ది పట్టణం దాటి వైకుంఠపురం ఆలయం సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. సంగారెడ్డి వైపు వస్తున్న బస్సును విపరీతమైన వేగంతో ఓవర్ టేక్ చేసేందుకు ట్రాలీ ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఈ బస్సును ఢీకొట్టాడు. దీంతో ట్రాలీలో ఉన్న ఫ్లెక్సీ ఫ్రేమ్స్ బస్సులోకి దూసుకొచ్చాయి. డ్రైవర్ వెనకాల సీట్లో మధ్యలో కూర్చున్న పూజ తలలో గుచ్చుకున్నాయి. డ్రైవర్ తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రాణాలు కోల్పోయిన.. ఇంజినీరింగ్ విద్యార్థిని!
నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన పూజ బాసర ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫ్లెక్సీ ఫ్రేమ్ రాడ్ వచ్చి ఆమె తలలో బలంగా గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆ అమ్మాయి ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలొదింది. పండగ వేళ ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.



