తెలంగాణమెదక్

Tekmal: అమ్మ ఒడిలాంటి బడికి… అ‘పూర్వ’విద్యార్థుల అండ!

తమకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు తోడ్పడిన బడిని వారు మర్చిపోలేదు. తాము ఆర్థికంగా, సామాజికంగా ఒక హోదాను దక్కించుకునేందుకు కారణమైన అమ్మ ఒడిలాంటి బడికి తమ వంతుగా అండగా నిలవానుకున్నారు.

* తాము విద్యాబుద్దులు నేర్చుకున్న పాఠశాలలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న తీరు
* 1986–87 పదో తరగతి బ్యాచ్​ విద్యార్థుల చొరవ
* ప్రతిభ చూపే బాలబాలికలకు ప్రోత్సాహక నగదు బహుమతులు
* తమతోటి వారు కష్టాల్లో ఉన్నా స్పందిస్తూ ఊరట దక్కేలా కృషి
* స్ఫూర్తిగా నిలుస్తున్న టేక్మాల్​ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు

కందిలి, మెదక్​
తమకు విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు తోడ్పడిన బడిని వారు మర్చిపోలేదు. తాము ఆర్థికంగా, సామాజికంగా ఒక హోదాను దక్కించుకునేందుకు కారణమైన అమ్మ ఒడిలాంటి బడికి తమ వంతుగా అండగా నిలవానుకున్నారు. పదేళ్లుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తి చాటుతున్నారు. టేక్మాల్​ మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1986–87 పదో బ్యాచ్​ కు చెందిన పూర్వ విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

60 మంది కలిసి.. అండగా నిలుస్తున్నతీరు!
1986–-87 పదో తరగతి బ్యాచ్​ లో 107 మంది విద్యార్థులు ఉండేవారు. వీరిలో 60 మంది పూర్వ విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడ్డారు. తాము చిన్నతనంలో చదువుకున్న పాఠశాలకు అండగా నిలవాలనుకున్నారు. అలా పదేళ్లుగా ఈ బడిలో చదువుకుంటూ, ప్రతిభ చాటుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.10వ తరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారికి ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్​, ఉర్దూ ఇలా మూడు మీడియాల్లోనూ మొదటి, రెండు, మూడు ర్యాంకులు సాధించిన వారికి సాయం చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. పరీక్షల సమయంలో అవసరమైన ప్రత్యేక గైడ్‌లు, వర్క్‌బుక్స్, ఇతర మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, మెరుగైన అభ్యసనం కోసం ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్లు వంటి డిజిటల్ పరికరాలను అందిస్తున్నారు. మౌలిక వసతుల కల్పన దిశగా కృషి చేస్తున్నారు.

తమతో చదువుకున్న వారు.. ఇబ్బందుల్లో ఉన్నా సాయం!
పూర్వ విద్యార్థులు అంతా కలిసి డబ్బులు జమచేస్తున్నారు. తమతో పాటు చదువుకున్న వారి కుటుంబాలు కష్టాల్లో ఉంటే, వారికి అండగా ఉన్నామని భరోసా ఇస్తున్నారు. గ్రామంలోని పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి ఊతమందిస్తున్నారు. ఫీజుల చెల్లింపు, పుస్తకాలు, దుస్తుల కొనుగోలు కోసం నగదు సాయం చేస్తున్నారు. తోటి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసి, వచ్చే వడ్డీతో పేద పిల్లల చదువులు కొనసాగేలా చొరవ చూపుతున్నారు. టేక్మాల్​ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *