Sangareddy: పోలీసుల లంచం సొమ్ము.. పెట్రోలు బంక్ ఫోన్ పే ఖాతాలోకి!
మద్యం సేవించి ఎవరైనా ఆ మార్గంలో వస్తున్నారంటే పోలీసులు పండుగ చేసుకుంటున్నారు. వాహనం ఆపగానే, బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు చేస్తున్నారు

* పటాన్ చెరు నియోజకవర్గంలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదీ వసూళ్ల దందా
* నిబంధనలను ఉల్లఘించే వారి బలహీనతలే ఆసరాగా దర్జాగా దందా చేస్తున్న ఒక ఎస్సై
* ప్రముఖ ఆలయం వద్దకు వచ్చి మద్యం సేవించి వాహనాలు నడిపే వారే టార్గెట్
* కేసు నమోదు కావొద్దంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్
*- పెట్రోల్ బంక్ ఫోన్ పే నంబరుకు డబ్బులు జమచేయాల్సిందిగా హుకుం
* చేసేదేమీలేక అడిగినంత ఫోన్ చేసి బతుకుజీవుడా అంటూ వెళ్లిపోతున్న వాహనదారులు
కందిలి, పటాన్ చెరు: మద్యం సేవించి ఎవరైనా ఆ మార్గంలో వస్తున్నారంటే పోలీసులు పండుగ చేసుకుంటున్నారు. వాహనం ఆపగానే, బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు చేస్తున్నారు. ఆ మొత్తం ఘటనను సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారు. కేసు నమోదవుతుందని భయపెడుతున్నారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే తాము ఇచ్చిన ఫోన్ పే నంబరుకు డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వసూళ్ల దందా యథేచ్చగా సాగుతోంది. కేవలం వాహనదారుల బలహీనతలను ఆసరా చేసుకొని లంచం సొమ్ములకు మరిగారు. ఈ అంశమై ‘కందిలి’ అందిస్తున్న పరిశోధనాత్మక కథనమిది.
ఎవరికీ చెప్పరనే ధీమాతో.. దర్జాగా వసూళ్లు!
పటాన్ చెరు నియోజకవర్గంలోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే పోలీసులు లంచం సొమ్ములు వసూలు చేయడంలో టెక్నాలజీని వాడుకుంటున్నారు. నేరుగా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో వాహనదారుల నుంచి ఫోన్ పే చేయించుకుంటున్నారు. అది కూడా తమను అనుకూలంగా ఉండే ఒక పెట్రోల్ బంక్ ఖాతాలో జమచేయిస్తున్నారు. తాము అనుకున్న టార్గెట్ పూర్తికాగానే, సదరు పెట్రోల్ బంకుకు వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరైనా ఈ అంశమై ఫిర్యాదు చేసినా, తమకేం సంబంధం లేదని చెప్పుకునేలా ఈ సరికొత్త ఆలోచనకు తెరదీశారు. వాహనదారులు ఎలాగూ నిబంధనలను ఉల్లంఘించారు… ఎవరికీ ఫిర్యాదు ఇవ్వరనే ధీమా వల్ల ఈ వసూళ్ల దందా గత కొంత కాలంగా యథేచ్ఛగా నడుస్తోంది.
వాహనం ఆపి.. బ్రీత్ అనలైజనరుతో పరీక్షిస్తూ వీడియోలు!
ఈ ప్రాంతంలో ఒక ప్రముఖ ఆలయం ఉంది. ఇక్కడకు శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో చాలా మంది వస్తుంటారు. మొక్కులు సమర్పించి, దావత్ లు చేసుకుంటారు. మద్యం సేవిస్తుంటారు. సరిగ్గా ఇదే అవకాశాన్ని ఆ పోలీస్ స్టేషనులోని ఎస్సై తమకు అనుకూలంగా మలచుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పరీక్షలు చేస్తూ, రోజూ దర్జాగా వసూళ్లకు తెరదీశారు. వాహనదారుడిని ఆపడం, బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయడం, ఆ మొత్తం ఘటనను వీడియో తీయడం చేస్తారు. దీంతో సహజంగానే వాహనదారులు భయపడిపోయి, కాళ్ల బేరానికి వస్తున్నారు. ఇదే అదనుగా లంచం ఇస్తే, కేసు ఉండదంటూ పోలీసులు చెబుతున్నారు. డబ్బులు ఇస్తామన్నా తీసుకోవడం లేదు. ఒక ఫోన్ పే నంబరు ఇచ్చి, దాంట్లోకి ట్రాన్స్ ఫర్ చేయాలని సూచిస్తున్నారు.
పోలీసు ఉన్నతాధికారులు… దృష్టిసారించాల్సిన అంశమిది!
ఇలా లంచం రూపంలో వసూలు చేస్తున్న డబ్బులు ఒక పెట్రోలు బంక్ ఖాతాలోకి చేరిపోతున్నాయి. ఆ రోజు చెకింగ్స్ ముగియగానే సదరు ఎస్సై ఆ డబ్బులు పెట్రోల్ బంక్ నుంచి తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారూ, ఈ అంశమై ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ఇలా పోలీసులకు చిక్కి, లంచం డబ్బులను ఫోన్ పే ద్వారా సమర్పించుకున్నారు. ఈ అంశమై సంగారెడ్డి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే, వాస్తవాలు వెలుగు చూస్తాయి.



