BJP: బీజేపీలో చేరిన అందోల్ కృష్ణ.. ఆహ్వానించిన రాంచందర్ రావు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సర్పంచుల సంఘం ఐక్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అందోల్ కృష్ణ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు.

సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సర్పంచుల సంఘం ఐక్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అందోల్ కృష్ణ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఈ చేరికలో కీలక పాత్ర పోషించారు. అందోల్ కృష్ణ చేరికతో చౌటకూర్ మండలంలో బీజేపీకి కొత్త బలం చేకూరినట్లయింది.
సర్పంచుల హక్కుల పోరాటం..
2013లో చక్రియాల గ్రామ సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అందోల్ కృష్ణ, సర్పంచుల నిధులు, విధుల కోసం ‘సర్పంచుల సంఘం ఐక్య వేదిక’ను స్థాపించారు. అన్నా హాజరే స్ఫూర్తితో ఢిల్లీ మరియు రాష్ట్ర స్థాయిలో అనేక ఉద్యమాలు చేపట్టారు. సర్పంచులకు నేడు అందుతున్న రూ. 7 వేల గౌరవ వేతనం ఆయన చేసిన సుదీర్ఘ పోరాట ఫలితమేనని పలువురు గుర్తు చేస్తారు.
రైతు పక్షపాతి..
పొలాల మీదుగా వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైన్ల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన పోరాడారు. రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చేయడంలో ఆయన విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి దామోదర రాజనరసింహ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు.
బీజేపీ వైపు మొగ్గుకు కారణాలు..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించకపోవడం వల్లే తాను పార్టీని వీడుతున్నట్లు అందోల్ కృష్ణ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాను” అని కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఇతర బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



