Patancheru: పటాన్‌చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. పటాన్‌చెరు పట్టణ కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి.

- ఫలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి..
- త్వరలో అందుబాటులోకి సేవలు
పటాన్‌చెరు: రియల్ ఎస్టేట్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. పటాన్‌చెరు పట్టణ కేంద్రంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిరంతర కృషితో హైకోర్టులో లైన్ క్లియర్ కావడంతో, కార్యాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నేపథ్యం, కోర్టు తీర్పు
2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని అప్పటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 2023లో ఉమ్మడి మెదక్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పటాన్‌చెరులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఈ జీవో అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం సంగారెడ్డిలోనే కొనసాగుతుందని, కేవలం పటాన్‌చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు మాత్రమే ఇక్కడ ప్రారంభిస్తామని కోర్టుకు తెలపడంతో స్టే ఎత్తివేస్తూ తీర్పు వెలువడింది.
ఈ కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా అమీన్‌పూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు మండలాల ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం కానున్నాయి.
త్వరలోనే ప్రారంభం
న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో అతి త్వరలోనే కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం పటాన్‌చెరులోని పాత ఎమ్మార్వో కార్యాలయం నుండి తాత్కాలికంగా సేవలు ప్రారంభమవుతాయని, శాశ్వత భవన నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.



