తెలంగాణసంగారెడ్డి

Republic Day: ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌లో మారుమోగనున్న తెలంగాణ డప్పు దరువు!

జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ సాంప్రదాయ డప్పు కళారూపం వినిపించనుంది.

  • సంగారెడ్డిలోని తారా కళాశాల నుంచి పదిమంది కళాకారులకు అరుదైన అవకాశం

కందిలి, సంగారెడ్డి: జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ సాంప్రదాయ డప్పు కళారూపం వినిపించనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని నాగపూర్ సౌత్ సెంట్రల్ కల్చర్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ అవార్డు గ్రహీత అందె భాస్కర్ నేతృత్వంలో 30 మంది డప్పు కళాకారులను ఎంపిక చేశారు. ఈ బృందంలో తారా కళాశాలకు చెందిన పదిమంది డప్పు కళాకారులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన అత్యుత్తమ కళారూపాల మధ్య తెలంగాణ రాష్ట్ర మట్టి వాసన, ఊపిరి కలిగిన డప్పు దరువును దిల్లీ వేదికగా ప్రదర్శించేందుకు అవకాశం లభించడం గర్వకారణమన్నారు.

అందె భాస్కర్ నేతృత్వంలో!

అందె భాస్కర్ నేతృత్వంలోని ఈ బృందంలో తారా కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పదిమంది ఉండడం విశేషమని, ఒకే కళాశాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపునకు ఎంపిక కావడం ఇదే తొలిసారి అని వివరించారు. ఇది కళాశాలకు లభించిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కళాకారులు ఈనెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దిల్లీలో శిక్షణ పొందిన అనంతరం, జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. తమ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ అవార్డు గ్రహీత అందె భాస్కర్‌కు కళాశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *