Telangana Breaking: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికలెప్పుడంటే?
తెలంగాణలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పురపాలక ఎన్నికల నగారా మోగింది.

హైదరాబాద్: తెలంగాణలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పురపాలక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు (Corporations), 116 పురపాలక సంఘాలకు (Municipalities) సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అధికారికంగా మంగళవారం విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం ఈ కింది షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ముఖ్యమైన తేదీల వివరాలు:
- ఎన్నికల కోడ్ అమలు: షెడ్యూల్ విడుదలైన క్షణం నుండి (జనవరి 27).
- నామినేషన్ల ప్రారంభం: జనవరి 28, 2026.
- నామినేషన్ల చివరి తేదీ: జనవరి 30, 2026.
- పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 11, 2026.
- ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు!
- ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
- పోటీలో ఉన్న స్థానాలు: మొత్తం 123 పురపాలక సంస్థలు (7 కార్పొరేషన్లు + 116 మున్సిపాలిటీలు) ఎన్నికలకు వెళ్తున్నాయి.
- ఓటర్ల సంఖ్య: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.
- బందోబస్తు: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని ఎస్ఈసీ ఆదేశించింది.
ఎన్నికల కోడ్ అమల్లోకి..
షెడ్యూల్ విడుదల కావడంతో కొత్త పథకాల ప్రకటనలు, బదిలీలపై నిషేధం ఉంటుంది. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ పురపాలక ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.



