IITH: వైద్య రంగంలో సరికొత్త విప్లవం.. ఐఐటీ హైదరాబాద్ వేదికగా కృత్రిమ ఊపిరితిత్తులు సృష్టించేలా పరిశోధనలు
ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న కోట్లాది మంది రోగులకు సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా ఐఐటీ హైదరాబాద్ (IITH) అడుగులు వేస్తోంది.

- జర్మనీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్ సంస్థతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు
- ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధుల నివారణ, చికిత్సల దిశగా మెరుగైన విధానాలను అభివృద్ధి చేసేలా ప్రణాళిక
- దేశీయంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ, ప్రపంచస్థాయిలోనూ పరిష్కారాలు చూపడమే లక్ష్యం
- రానున్న రోజుల్లో కృత్రిమ ఊపిరితిత్తులను రూపొందించడమే లక్ష్యంగా సాగనున్న పరిశోధనలు
- ‘బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’’ను ప్రారంభించిన IITH – ILH
- కార్యక్రమానికి హాజరైన పద్మవిభూషణ్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి
సంగారెడ్డి (కంది): ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న కోట్లాది మంది రోగులకు సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా ఐఐటీ హైదరాబాద్ (IITH) అడుగులు వేస్తోంది. జర్మనీకి చెందిన ప్రసిద్ధ ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్’ (ILH) తో కలిసి సంయుక్తంగా ‘కృత్రిమ ఊపిరితిత్తుల’ (Artificial Lungs) తయారీకి పరిశోధనలు ప్రారంభించింది.
ప్రారంభమైన ‘బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా “బయో ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” పేరుతో ఒక అత్యాధునిక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
ప్రస్తుత సమస్యకు శాశ్వత పరిష్కారం
సాధారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయినప్పుడు ప్రస్తుతం ‘ట్రాన్స్‌ప్లాంటేషన్’ (అవయవ మార్పిడి) మాత్రమే మార్గంగా ఉంది. అయితే, ఈ పద్ధతిలో విజయవకాశాలు (Success Rate) చాలా తక్కువగా ఉండటమే కాకుండా, మార్పిడి జరిగిన కొద్దిరోజులకే మళ్ళీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి పరిష్కారంగా అత్యాధునిక సాంకేతికతతో కృత్రిమ ఊపిరితిత్తులను తయారు చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. రానున్న రోజుల్లో వీటిని అందుబాటులోకి తెచ్చి, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రపంచస్థాయి పరిష్కారాలే లక్ష్యం
మన దేశంలో ఉన్న భౌగోళిక, ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న శ్వాసకోశ సమస్యలకు మెరుగైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయనున్నారు. వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, పరిశోధనల ఫలితాలను సామాన్యులకు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పరిశోధన గనుక సఫలీకృతమైతే, భవిష్యత్తులో అవయవ దాతల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కృత్రిమ అవయవాలతో ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుంది.



