ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
సంగారెడ్డిలో సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సామాజిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అమిత్ షాను పదవి నుంచి తొలగించి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ హోం శాఖ మంత్రిగా పనిచేస్తున్న అమిత్ షా నిండు రాజ్యసభలో మహనీయులు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్ పీడిత వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. అలాంటి మహనీయుడిపై అనుచితంగా మాట్లాడిన అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అశోక్, ప్రముఖ న్యాయవాది రామారావు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఇమ్మయ్య, న్యాయవాది లక్ష్మి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బి అశోక్, సీనియర్ నాయకులు అనంతయ్య, రాములు, లక్ష్మయ్య, జైపాల్ నాయక్, రాజేందర్ నాయక్, మాజీ సర్పంచ్ లు సాగర్, నాగరాజ్, ప్రభుదాస్, ప్రవీణ్, పవన్, బస్వరాజ్, నగేష్, దాసు, కృష్ణ, దత్తు, ఉదయ్, యాదగిరి, సాగర్, సురేష్ నాయక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు