- ఆయన ఏ పిలుపు ఇచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలమంతా సిద్ధం
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
అమిత్ షాకు, రాహుల్ గాంధీకి తేడా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ వేదికగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ…రాహుల్ గాంధీ రోజూ దేవుడిని మొక్కుతారు కానీ పబ్లిసిటీ చేసుకోరన్నారు. బీజేపీ వాళ్లు దేవుణ్ణి మొక్కి పబ్లిసిటీ చేసుకుంటారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అంటే దేశ ప్రజలకు ఒక ధైర్యం, ఒక కవచం అని వివరించారు.ఆ రాజ్యాంగం వల్లనే మోడీ, అమిత్ షా పదవులు అనుభవిస్తున్నారన్నారు.రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ కి ప్రోత్సాహం ఇచ్చింది జవహర్ లాల్ నెహ్రూ అని, ఆ రాజ్యాంగాన్ని కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్నది నెహ్రూ ముని మనవడు రాహుల్ గాంధీ అని స్పష్టం చేశారు. అమిత్ షా క్షమాపణలు చెప్పే వరకు రాహుల్ గాంధీ తన పోరాటం ఆపరన్నారు.
రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం!
దేశ ప్రజలు ఈరోజు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ రాజ్యాంగ ఫలితమేనని జగ్గారెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అందుకే రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ విషయంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ కుట్ర చేసి రాహుల్ గాంధీని గత పర్యాయం పార్లమెంట్ లో ఉండకుండా కుట్రలు చేశారన్నారు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీని పార్లమెంట్ కి రాకుండా దాడి చేసి అడ్డుకుంటున్నారన్నారు. అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పి తీరాలన్నారు. రాహుల్ గాంధీ ఏ పిలుపు ఇచ్చినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమంతా సిద్ధంగా ఉన్నామన్నారు.