అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
సీపీఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను పురస్కరించుకొని ఇంటింటికి విరాళాల సేకరణ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితుల వెనుకబాటుతనాన్ని, అంటరానితనాన్ని తీవ్రంగా ప్రశ్నించి, తన జీవితాన్ని బడుగు, బలహీన వర్గాలకు అంకితం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. అంతటి మహానీయుడిని చులకన చేస్తూ అమిత్ షా వ్యాఖ్యలు చేయడం, వాటిని ప్రధానమంత్రి మోడీ సమర్ధించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజలను ఎలా పాలించాలోనన్న సమానత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువచ్చింది అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దళితులకు రిజర్వేషన్ కేటాయింపులో అంబేద్కర్ కృషి ప్రత్యేకమైనదన్నారు. రాజ్యాంగ మార్పు అనేది బీజేపీ లక్ష్యమని, దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలనే యోచనలో భాగంగానే అమిత్ షా అంబేద్కర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవేనన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను మేధావులు, ప్రజలు ఖండించాలన్నారు. జనవరి 25నుంచి 28 వరకు సంగారెడ్డి వేదికగా నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అశోక్, సురేష్, మహిపాల్, ఆంజనేయులు, సాయిలు పాల్గొన్నారు.