జాతీయం

ఆన్‌లైన్ అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కఠిన హెచ్చరిక.. ప్లాట్‌ఫామ్‌లకు చివరి అవకాశం!

ఆన్‌లైన్‌లో అశ్లీల, పోర్నోగ్రఫిక్ కంటెంట్ పెరుగుదలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. వెంటనే తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని సోషల్ మీడియా కంపెనీలకు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చింది.

  • ఆన్‌లైన్ అశ్లీల కంటెంట్‌పై కేంద్రం కఠిన హెచ్చరిక
  • సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు డ్యూ డిలిజెన్స్ తప్పనిసరి
  • ఐటీ రూల్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

సోషల్ మీడియా వేదికలపై అశ్లీల, అసభ్యకర, పోర్నోగ్రఫిక్ కంటెంట్ పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తించిన ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.

డిసెంబర్ 29, 2025న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) విడుదల చేసిన అడ్వైజరీలో, అశ్లీల కంటెంట్‌ను వెంటనే తొలగించకపోతే తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు తమ బాధ్యతలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పింది.

ఐటీ యాక్ట్ సెక్షన్ 79 కింద లభించే ‘సేఫ్ హార్బర్’ రక్షణ పొందాలంటే, యూజర్లు అప్‌లోడ్ చేసే కంటెంట్‌పై కఠిన పర్యవేక్షణ ఉండాలని కేంద్రం ఆదేశించింది. అశ్లీల, పిల్లలకు హానికరమైన లేదా చట్టవిరుద్ధ కంటెంట్‌ను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఐటీ రూల్స్ 2021 అమలు:

కొత్త ఐటీ నిబంధనల ప్రకారం, కోర్టు ఆదేశాలు లేదా ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వివాదాస్పద కంటెంట్‌ను తొలగించాలి. 50 లక్షలకు పైగా యూజర్లు ఉన్న పెద్ద ప్లాట్‌ఫామ్‌లు ఆటోమేటెడ్ టెక్నాలజీ ద్వారా ఇలాంటి కంటెంట్‌ను గుర్తించి తొలగించాల్సిందే.

24 గంటల్లో చర్య:

ఇంపర్సనేషన్ లేదా అశ్లీల కంటెంట్‌పై బాధితులు ఫిర్యాదు చేస్తే, 24 గంటల్లోనే తొలగించాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

ఉల్లంఘనలపై కఠిన చర్యలు:

నిబంధనలు పాటించని ప్లాట్‌ఫామ్‌లు, సంస్థలు, యూజర్లపై ఐటీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (BNS) తదితర చట్టాల కింద కేసులు నమోదు అవుతాయని హెచ్చరించింది. సేఫ్ హార్బర్ కోల్పోతే థర్డ్ పార్టీ కంటెంట్‌కు కూడా ప్లాట్‌ఫామ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

AI కంటెంట్‌పై ఆందోళన:

ఇటీవల AI ద్వారా రూపొందిస్తున్న అశ్లీల ఫొటోలు, వీడియోలు పెరుగుతుండటంపై మహిళా సంఘాలు, సామాజికవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటెంట్ మాడరేషన్ విధానాలను వెంటనే రివ్యూ చేయాలని కేంద్రం ఆదేశించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *