హైదరాబాద్ బిట్స్‌లో ‘యాక్సిస్ బ్యాంక్’ ఇన్నోవేషన్ పార్క్.. రూ.100 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో సరికొత్త ల్యాబ్స్!
తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగానికి మరో భారీ ఊతం లభించింది. హైదరాబాద్ వేదికగా అకడమిక్ పరిశోధనలను నేరుగా మార్కెట్ ఉత్పత్తులుగా మార్చేందుకు (Lab-to-Market) ఒక మెగా ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది.

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగానికి మరో భారీ ఊతం లభించింది. హైదరాబాద్ వేదికగా అకడమిక్ పరిశోధనలను నేరుగా మార్కెట్ ఉత్పత్తులుగా మార్చేందుకు (Lab-to-Market) ఒక మెగా ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. దేశంలోనే దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ అయిన ‘యాక్సిస్ బ్యాంక్’, ప్రముఖ విద్యాసంస్థ ‘బిట్స్ పిలానీ’ కలిసి హైదరాబాద్ క్యాంపస్‌లో సరికొత్త రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక హబ్ కోసం యాక్సిస్ బ్యాంక్ రూ.100 కోట్ల భారీ సీఎస్‌ఆర్ (CSR) నిధులను కేటాయించింది.
లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాలపై ఫోకస్
హైదరాబాద్‌లోని ‘జీనోమ్ వ్యాలీ’ బయో-టెక్ కారిడార్‌కు ఆనుకుని ఉన్న బిట్స్ క్యాంపస్‌లో ఈ పార్క్ రానుంది. ఇక్కడ ప్రధానంగా బయోఫార్మా, డిజిటల్ హెల్త్‌కేర్, అధునాతన వైద్య పరికరాల (Medical Devices) రూపకల్పనపై రీసెర్చ్ జరుగుతుంది. సామాన్యుడికి సైతం అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ల్యాబ్స్ ప్రధాన లక్ష్యం.
స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎమ్‌ఈలకు అండగా..
సుమారు 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ ఐటి పార్క్‌లో అత్యాధునిక ల్యాబొరేటరీలు, ఇంక్యుబేషన్ సెంటర్లు కొలువుదీరనున్నాయి. కేవలం బిట్స్ విద్యార్థులకే కాకుండా బయటి స్టార్టప్‌లు, చిన్న తరహా పరిశ్రమల (MSME) ఆవిష్కర్తలకు కూడా ఇక్కడ స్థానం కల్పిస్తారు. బిట్స్ పిలానీకి చెందిన నిపుణులు ఈ రీసెర్చ్ పార్క్‌కు గైడెన్స్ ఇస్తూ, మేధో సంపత్తి (IP) హక్కుల రిజిస్ట్రేషన్ మరియు టెక్నాలజీ బదిలీలో సహాయం అందిస్తారు.
దేశీయ సాంకేతికతకు పెద్దపీట
కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపునకు తగ్గట్టుగా.. వైద్య మరియు డీప్-టెక్ రంగాలలో విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుంది. పరిశ్రమ-విద్యాసంస్థల (Industry-Academia) కలయికతో దేశంలోనే ఒక మోడల్ ఇన్నోవేషన్ హబ్‌గా ఇది నిలుస్తుందని ఇరు సంస్థల ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.



