BJP:బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి.. రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్ వస్తుందని ధీమా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబిన్‌ను ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబిన్‌ను ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో, అంజిరెడ్డి నూతన అధ్యక్షుడికి పూలబొకే అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి, అతి చిన్న వయసులోనే నితిన్ నబిన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం శుభపరిణామమని కొనియాడారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, నితిన్ నబిన్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ విజయం సాధించి, ‘డబుల్ ఇంజన్’ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్లు అంజిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసేలా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని జాతీయ అధ్యక్షుడు తనకు సూచించారని వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు.



