బిజినెస్

సరికొత్త గ్లోబల్ స్ట్రీమింగ్ రికార్డును సృష్టించిన జియోహాట్‌స్టార్‌ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 క్రీడలు, మీడియా, స్ట్రీమింగ్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది.

  • జియోహాట్‌స్టార్‌లో భారత్ – ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఒకే సమయంలో 2 మిలియన్ల గరిష్ట వీక్షకులను నమోదు చేసింది.
  • ఈ రెండో సెమీఫైనల్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధికంగా స్ట్రీమింగ్ అయిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంగా నిలిచింది.
  • ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో 619 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. ఇది ఒక టీ20 మ్యాచ్‌కు లభించిన అత్యధిక వ్యూస్.

హైదరాబాద్: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 క్రీడలు, మీడియా, స్ట్రీమింగ్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది. మార్చి 5న జరిగిన భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ డిజిటల్ వ్యూస్‌లో ఒక చరిత్రాత్మక గ్లోబల్ మైలురాయిని చేరుకుంది.

భారతదేశపు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియో హాట్‌స్టార్ ఈ అత్యంత ఉత్కంఠభరితమైన పోరులో మునుపెన్నడూ లేని విధంగా ఒకే సమయంలో 65.2 మిలియన్ల గరిష్ట వ్యూస్‌ను నమోదు చేసింది. ప్రపంచంలోని ఏ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనైనా ఒక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం కోసం సాధించిన అత్యధిక కాన్‌కరెన్సీగా ఇది కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్ జియోహాట్‌స్టార్‌లో 619 మిలియన్ల వ్యూస్‌ను కూడా సాధించింది. తద్వారా చరిత్రలో అత్యధికంగా స్ట్రీమ్ అయిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది.

రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 499 పరుగులు నమోదైన ఈ ఉత్కంఠభరితమైన పోరు భారత్‌లోని మరియు ఇతర దేశాల్లోని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. నవంబర్ 2024లో ఒక అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వివిధ దేశాల్లోని వీక్షకులందరినీ కలిపి సాధించిన 65 మిలియన్ల పాత రికార్డును ఈ గరిష్ట వ్యూస్ అధిగమించింది. అయితే జియోహాట్‌స్టార్ రికార్డు కేవలం ఒకే దేశంలోని ప్రేక్షకుల ద్వారా రావడం గమనార్హం. ఇది లైవ్ స్ట్రీమింగ్‌లో గ్లోబల్ లీడర్‌గా జియోహాట్‌స్టార్ స్థానాన్ని మరియు అత్యధిక డిమాండ్‌ను తట్టుకుంటూనే అంతరాయం లేని వీక్షణ అనుభవాన్ని అందించే దాని సాంకేతిక సామర్థ్యాన్ని చాటిచెప్పింది. భారత జట్టుకు ఉన్న ఆదరణ తప్పనిసరిగా గెలవాల్సిన సెమీఫైనల్ ప్రాముఖ్యత మరియు అభిమానుల కోసం చేపట్టిన భారీ కార్యక్రమాల వల్ల ఒక ప్రధాన ఐసీసీ ఈవెంట్ ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ఈ రికార్డు మరోసారి నిరూపించింది.

లీనియర్ టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు రెండింటినీ కలిపి ఈ సెమీఫైనల్ 320 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షకులను చేరుకుంది. అదేవిధంగా అన్ని స్క్రీన్లలో కలిపి దీని వాచ్-టైమ్ అసాధారణంగా 23 బిలియన్ నిమిషాలను దాటింది. దీంతో ఇది ఇప్పటివరకు అత్యధికంగా వీక్షించబడిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది.

ఐసీసీ ఛైర్మన్ జై షా(Jay Shah) మాట్లాడుతూ.. “ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ భారత దేశంలోని కోట్లాది మంది క్రికెట్ అభిమానులను ఏకం చేయడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా నమోదైన అద్భుతమైన గణాంకాలు కేవలం క్రికెట్ అభిమానుల అభిరుచినే కాకుండా ఈ క్రీడను ప్రపంచవ్యాప్తంగా అందరికీ మరింత చేరువ చేయడంలో మరియు ఆకట్టుకునేలా చేయడంలో జరుగుతున్న అద్భుతమైన పురోగతిని కూడా ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రపంచ కప్ మైదానంలోని ఆటతో పాటు కోట్లాది మంది అభిమానులు క్రీడను జరుపుకోవడానికి ఏకమైన తీరుకు కూడా గుర్తుండిపోతుంది” అని పేర్కొన్నారు.

జియోస్టార్ వైస్ ఛైర్మన్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. “ఇది జియోస్టార్ సాంకేతిక, సృజనాత్మక ప్రతిభకు అలాగే క్రికెట్ క్రీడను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఐసీసీ నిబద్ధతకు నిదర్శనం. గురువారం జరిగిన ఈ రెండో సెమీఫైనల్ మ్యాచ్‌ను ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు వీక్షించారు. కోట్ల సంఖ్యలో ప్రజలు ఒకేసారి వీక్షిస్తున్నప్పుడు ఆ ప్రసారాన్ని విజయవంతంగా అందించడానికి అత్యుత్తమ సాంకేతికత అవసరం. భవిష్యత్తులో వినోదం ఏ విధంగా ఉండబోతుందో ఇది ప్రతిబింబిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.

రెండు జట్ల అద్భుతమైన ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌ సమయంలో నమోదైన 619 మిలియన్ల వ్యూస్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో నమోదైన 533 మిలియన్ల వ్యూస్ రికార్డును అధిగమించాయి.

ఇంకా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగానే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 అప్పుడే డిజిటల్, బ్రాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో వ్యూస్, ప్రేక్షకుల భాగస్వామ్యం పరంగా అనేక నూతన మైలురాళ్లను నెలకొల్పింది.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో భారత్ – న్యూజిలాండ్ జట్లు మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. అభిమానులు ఈ మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *