బిజినెస్

మణిపాల్ సిగ్నా ‘ఇండియా హెల్త్ కోషెంట్ 2026’ సర్వే.. పోషకాహారానికి పెద్దపీట వేస్తున్న దక్షిణాది ప్రజలు!

ప్రముఖ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన 'ఇండియా హెల్త్ కోషెంట్ (IHQ) 2026' సర్వేలోని దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక విశేషాలను విడుదల చేసింది

హైదరాబాద్: ప్రముఖ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఇండియా హెల్త్ కోషెంట్ (IHQ) 2026’ సర్వేలోని దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక విశేషాలను విడుదల చేసింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, కోయంబత్తూర్ సహా దేశంలోని 16 ప్రధాన నగరాల్లో ఈ అధ్యయనం సాగింది. శారీరక, మానసిక, ఆర్థిక, వృత్తిపరమైన , సామాజిక ఆరోగ్య అంశాల ఆధారంగా ప్రజల జీవనశైలిని ఈ సర్వే అంచనా వేసింది.

ఆరోగ్య సూచీలు , ఆహారపు అలవాట్లు:
పట్టణ భారతదేశం మొత్తం మీద సగటున 65 ఆరోగ్య స్కోర్‌ను నమోదు చేయగా, దక్షిణాది ప్రాంతం 63 పాయింట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా శారీరక ఆరోగ్యం 68 పాయింట్లతో మెరుగ్గా ఉండగా, ఆర్థిక ఆరోగ్యం మాత్రం 62 పాయింట్లతో అత్యంత వెనుకబడి ఉంది.

ఈ సర్వే వెల్లడించిన మరికొన్ని ముఖ్యాంశాలు:

సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత: దేశంలోని ఇతర ప్రాంతాలతో (65%) పోలిస్తే, దక్షిణాదిలో 72% మంది ప్రజలు తమ శారీరక ఆరోగ్య లక్ష్యాల్లో సమతుల్య ఆహారానికి (balanced diet) అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ముందంజలో టెక్ నగరాలు: ఐటీ హబ్‌లైన బెంగళూరు , హైదరాబాద్‌లలో ఈ ఆరోగ్య స్పృహ మరింత ఎక్కువగా ఉండి, రెండు నగరాల్లోనూ 75% మంది ఆరోగ్యకరమైన పోషకాహారానికే మొగ్గు చూపారు.

మానసిక ఆరోగ్యంలో సవాళ్లు: శారీరక క్రమశిక్షణ బాగున్నప్పటికీ, మానసిక ఆరోగ్యం విషయంలో మాత్రం మరింత శ్రద్ధ అవసరమని సర్వే తెలిపింది. కేవలం 49% మంది మాత్రమే బలమైన మానసిక స్పష్టతను కలిగి ఉన్నామని, 47% మంది మాత్రమే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఉందని వెల్లడించారు.

ఆరోగ్య బీమాతో ‘వెల్‌బీయింగ్ ప్రీమియం’:
వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత కీలకమో ఈ నివేదిక స్పష్టం చేసింది. తగిన ఆరోగ్య బీమా కలిగి ఉన్న పట్టణ ప్రజల హెల్త్ స్కోర్ 68గా ఉండగా, బీమా లేనివారి స్కోర్ 62గానే పరిమితమైంది. వయసు, లింగభేదాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల్లోనూ ఈ 6 పాయింట్ల వ్యత్యాసం కనిపించడం గమనార్హం.

నిపుణుల మాట:
ఈ నివేదికపై మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సప్నా దేశాయ్ మాట్లాడుతూ.. “ఆరోగ్యం అనేది కేవలం శారీరక అంశం మాత్రమే కాదు. దక్షిణాదిలో 72% మంది (బెంగళూరు, హైదరాబాద్‌లలో 75%) ఆరోగ్యకరమైన భోజనానికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం. అయితే, దైనందిన ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఇది ఒక్కటే సరిపోదు. ప్రజలు తమ సమగ్ర ఆరోగ్య లక్ష్యాల సాధనలో భాగంగా సరైన ఆర్థిక రక్షణను, ఆరోగ్య బీమాను కలిగి ఉండటం ఎంతైనా అవసరం” అని పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *