Crime News: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ గురుస్వామి, తనకు జరిగిన ఏటీఎం మోసంపై పోలీసుల నుంచి న్యాయం లభించలేదంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కందిలి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ గురుస్వామి, తనకు జరిగిన ఏటీఎం మోసంపై పోలీసుల నుంచి న్యాయం లభించలేదంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 3న బొంతపల్లి వద్ద తన ఏటీఎం కార్డు ద్వారా కొందరు వ్యక్తులు నమ్మించి మోసం చేసి, ఒకసారి రూ.9 వేలతో పాటు మరోసారి రూ.90 వేలను డ్రా చేశారని, ఈ విషయమై గుమ్మడిదల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు.
ఈ నేపథ్యంలో న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన గురుస్వామి, వెంట తెచ్చుకున్న డీజిల్ క్యాన్‌లోని డీజిల్‌ను తన ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని, సంబంధిత ఎస్సైకి ఫోన్ ద్వారా సూచనలు ఇచ్చి, ఫిర్యాదును తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం డ్రైవర్‌ను అక్కడి నుంచి పంపించారు.



